Independence Day 2023 : ఈ ఊళ్లు జవాన్ల పుట్టిళ్లు

Independence Day 2023 :  ఈ ఊళ్లు జవాన్ల పుట్టిళ్లు

ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలా ఈ ఊళ్లకి ఉన్న ప్రత్యేకత ‘దేశభక్తి’. దేశాన్ని కాపాడాలనే ధ్యేయంతో ఊరి జనాలు సైన్యం బాట పడతారు. సైన్యంలో చేరడమంటే ప్రాణాలతో చెలగాటమని తెలిసినా.. లెక్కచేయరు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరమవుతున్నా.. యుద్ధరంగంలో వీరుడిగా పోరాడటమే లక్ష్యంగా ముందుకెళ్తారు. దేశాన్ని రక్షించే బాధ్యత అందరిదీ.. కాబట్టి  ఇంటి నుంచి ఒకరైనా సైన్యంలో చేరాలనే ఆశయంతో ఒక ఊరిలోనే ఎన్నో కుటుంబాలు ఆర్మీలో చేరాయి. అలా చేరిన ఎన్నో గ్రామాల్ని నేడు ‘ఆర్మీ విలేజెస్​’గా పిలుస్తున్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అలాంటి స్ఫూర్తి నింపుకున్న ఆ గ్రామాల గురించి తెలుసుకుందాం...


తెలంగాణకు చెందిన ఎంతో మంది యువకులు సైన్యంలో చేరారు. అంతేకాక, ఊరంతా సైన్యంలో చేరేలా ఇన్​స్పైర్ చేశారు. దాంతో కొన్ని గ్రామాలు సైనిక గ్రామాలుగా మారిపోయాయి. తెలంగాణలో సైనిక గ్రామాలు నల్గొండ జిల్లాలో బొందుగుల గ్రామాన్ని ఆర్మీ విలేజ్​ అని పిలుస్తారు. ఈ విలేజ్​ నుండి ఏటా కొంతమంది సైన్యంలో చేరుతుంటారు. ముఫ్పై ఏండ్ల కిందట గడ్డమీది మల్లేశ్ ఆర్మీలో చేరాడు. సొంతూరికి వచ్చినప్పుడల్లా బార్డర్​లో అనుభవాలను ఊరివాళ్లతో పంచుకునేవాడు. దాంతో ఆ ఊరి వాళ్లకి ఆర్మీలో చేరాలనే ఆసక్తి మొదలైంది. టెన్త్, ఇంటర్ చదివిన వాళ్లు కూడా ఆర్మీలో చేరాలని ఇన్​స్పైర్ అయ్యారు. ఇప్పటికే 30 మంది వరకు సైన్యంలో సేవలందిస్తున్నారు. తండ్రి కలను నెరవేర్చడానికి ఆర్మీలో చేరేవాళ్లు కూడా ఉన్నారు. ప్రాణత్యాగం చేయాల్సి వస్తుందన్న భయం కనపడదు వాళ్లలో. తల్లిదండ్రులే దగ్గరుండి ధైర్యంగా కన్నబిడ్డల్ని సైన్యంలోకి పంపిస్తారు. ఇంటికి ఒక్కడే కొడుకు ఉన్నా, చావుతో పోరాటమని తెలిసినా.. దేశానికి సేవ చేయడం కంటే ఆనందం ఏముంది? అంటారు తల్లిదండ్రులు. ఒకరిని చూసి మరొకరు సైన్యానికి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. అలాగే కిష్టాపూర్, నర్సాపూర్ గ్రామాలను తెలంగాణ ఆర్మీ విలేజ్​లు అంటారు. ఈ ఊళ్లలో ప్రతి ఇంటికి ఒకరు నుంచి ముగ్గురి వరకు సైన్యంలో పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకున్నా ‘సైన్యంలో చేరడమే మా లక్ష్య’మంటారు వాళ్లు. ఆ ఊరి వాళ్లు ఎక్కువగా ఆర్మీలో ఉండడం గర్వంగా ఉందంటున్నారు గ్రామస్తులు. 

కట్కూరు కేరాఫ్​ ఆర్మీ

సైన్యంలో పనిచేసే అదృష్టం అందరికీ రాదు. కానీ, ఆ ఊరి వాళ్లు మాత్రం ఒకరూ ఇద్దరూ కాదు, ఏకంగా వంద మందికి పైగా సైన్యంలో పనిచేస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే సుమారు 40 మంది సైన్యంలో పనిచేసి రిటైరయ్యారు కూడా. ఆర్మీకి కేరాఫ్​ అడ్రస్​గా మారిన ఆ గ్రామమే కట్కూరు. ఇది సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఉంది. ఈ ఊళ్లో సుమారు 900 ఇండ్లు ఉంటాయి. 3,500 జనాభా ఉంటుంది. దాదాపు యాభై ఏండ్ల కిందట గ్రామం నుంచి జెర్రిపోతుల డానియల్​ ఆర్మీలో చేరారు. ఆ తర్వాత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఊళ్లోని చాలామంది యువకులు ఆర్మీ బాట పట్టారు. అలా ఈ ఊరి నుంచి ఎంతో మంది యువకులు ఆర్మీ, నేవీల్లో చేరారు. జవాన్, లాన్స్ నాయక్, హవల్దార్, నాయక్, సుబేదార్ పోస్టులతో పాటు టెక్నికల్ విభాగాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.


వీర జవానుకు విగ్రహం

కట్కూరుకు దగ్గరలోని రాజు తండాకు చెందిన గుగులోత్  నరసింహ నాయక్ సైన్యంలో పనిచేస్తూ, 2014 లో సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించాడు.  ఆ వీర జవాన్ విగ్రహాన్ని  తండ్రి గుగులోత్​ లింగయ్య తమ పొలంలో కట్టించాడు. ఈ విగ్రహానికి ఏటా రాఖీ పండుగ రోజు నరసింహ నాయక్ చెల్లెళ్లు ముగ్గురూ రాఖీ కడుతుంటారు.  నరసింహ నాయక్​ను స్ఫూర్తిగా తీసుకున్న గ్రామంలోని యువకుల్లో ఇప్పటి వరకు సుమారు 25 మంది ఆర్మీలో చేరారు.


ఆర్మీ స్ట్రీట్

దేశంపై ఉన్న అభిమానం ఆ వీధిలోని యువకులను సరిహద్దుల వరకు చేర్చింది.  ఒకరు, ఇద్దరు కాదు ఒకే వీధిలోని 25 మంది యువకులు ఈ గొప్ప పనిలో ఉన్నారు. ఆర్మీస్ట్రీట్​గా మారిన ఆ వీధి.. నిర్మల్ పట్టణంలోని పాతబస్తీలో ఉన్న బంగల్ పేట్.  సైన్యంలో పనిచేస్తున్న ఈ వీధి యువకులు బంగల్ పేటలో సేవా కార్యక్రమాలకు కూడా బాసటగా నిలుస్తున్నారు.

ఒకరిని చూసి ఒకరు

ఆర్మీలో చేరడానికి ఆ ఊరి యువకులు పోటీ పడుతుంటారు. అందుకే ఊరి నుంచి ఏకంగా 53 మంది సైన్యంలో చేరారు. ఆ గ్రామమే మహబూబ్​నగర్​ జిల్లా మహ్మదాబాద్​ మండలం వెంటక్​రెడ్డిపల్లి. గ్రామంలో450 ఇండ్లు ఉన్నాయి. సుమారు1,643 జనాభా ఉంది. 1976 ఆగస్ట్​ 11న ఈ గ్రామానికి చెందిన కొత్త భగవంతరెడ్డి ఆర్మీలో చేరారు. గ్రామం నుంచి సైన్యంలో చేరిన మొదటి వ్యక్తి ఆయనే. ఆ తర్వాత భగవంతరెడ్డి స్ఫూర్తితో చాలామంది ఆర్మీలో చేరారు. వాళ్లలో ఇప్పటికి 22 మంది రిటైర్​ అయ్యారు. మిగిలిన వాళ్లు సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు గ్రామంలోని యువకులకు ట్రైనింగ్​ ఇస్తున్నారు.


మిలటరీ ‘ముగడ’

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లాలో ముగడ అనే గ్రామం ఉంది. అసలు పేరు ముగడ, కానీ దాన్ని అందరూ మిలటరీ ఊరు అనే పిలుస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో మిలటరీలో చేరడానికి యువత ధైర్యం చేయలేదు. అప్పట్లో యామల స్వామినాయుడు అనే రిటైర్డ్ టీచర్​ ఆర్మీలో చేరమని ఎంకరేజ్​ చేసేవాడు. తన బావమరిదిని ఆర్మీలో చేరేందుకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత  ఆయన ఆర్మీలో చేరి, కల్నల్ అయ్యాడు. ఆర్మీలో చేరమని మిగతా వారిని ఇన్​స్పైర్ చేసేవాడు. అప్పటి నుంచి యువతలో ఆలోచన మారింది. ఇప్పుడు ఆ ఊళ్లో 900 పైగా ఇండ్లు ఉంటే, వాటిలో 200 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్​ ఫోర్స్, బీఎస్ఎఫ్​లలో పనిచేస్తున్నారు. ఈ ఊళ్లో 63 మంది త్రివిధ దళాల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. మరికొంతమంది రకరకాల కేడర్​లలో పనిచేస్తున్నారు. అంతేకాదు, ఆ ఊరి జవాన్లంతా కలిసి ముగడలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు.

యుద్ధరంగంలో మాధవరం

పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడేనికి చెందిన  గ్రామం మాధవరం. ఈ ఊరి పేరు వినగానే మిలటరీ గుర్తొస్తుంది. ఎందుకంటే స్వాతంత్ర్యం రాక ముందు నుంచే జవాన్లు, ఆఫీసర్లుగా దేశానికి సేవచేశారు ఆ ఊరి ప్రజలు. ఈ ఊరి వాళ్లు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, స్వాతంత్ర్య పోరాటం, పాకిస్తాన్, చైనాతో యుద్ధాలు, బంగ్లాదేశ్, శ్రీలంక తరపున చేసిన పోరాటాల్లో పాల్గొన్నారు. భారత్​ – పాక్ మధ్య జరిగిన యుద్ధాల్లో1,850 మంది మాధవరం జవాన్లే ఉన్నారు. మొదటి వార్ మెమోరియల్ ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉంది. రెండోది మాధవరంలో ఉంది. ప్రస్తుతం ఈ ఊరి వాళ్లలో1,650 మంది సైన్యంలో పనిచేస్తున్నారు. ఆర్మీలో చేరాలనుకునే వాళ్లకు ఎక్స్​సర్వీస్​మెన్ అసోసియేషన్ గైడెన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తోంది. ఇవేకాకుండా ప్రకాశం జిల్లాలో కొమరోలు మండలంలో మల్లారెడ్డి పల్లె ఉంది. ఆ ఊళ్లో ప్రతి ఇంట్లో ఒకరో, ఇద్దరో సైన్యంలో పనిచేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. ఈ ఊళ్లో నూటికి తొంభై శాతం ముస్లింలే. మనదేశాన్ని మనం కాపాడుకోవాలనే భావన వాళ్లది. వాళ్లంతా దాదాపు 50 ఏండ్లుగా దేశానికి సేవలందిస్తున్నారు ఈ ఊరి వాళ్లంతా. ఇవన్నీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామాలైతే... దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఊళ్లు ఉన్నాయి.

సైనిక్ గిర్గావ్

మహారాష్ట్రలోని కొల్హాపూర్​కు చెందిన మారుమూల గ్రామం గిర్గావ్. నాలుగు వేల జనాభాలో చాలామంది మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటి వరకు ఆర్మీలో పనిచేస్తున్నారు. అందుకే దీనికి ‘సైనిక్ గిర్గావ్’ అనే పేరొచ్చింది. 1857 సిపాయి తిరుగుబాటులోనూ ఈ ఊరి జవాన్​ తన ధైర్యసాహసాలు చూపాడు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి​తో ఇప్పటికీ ఆర్మీలో చేరాలనుకుంటారు ఆ ఊరి యువత. అలాగే1971 యుద్ధంలో ఈ ఊరి జవాన్లు పాల్గొన్నారు. రిటైర్డ్ జవాన్లు నేటి యువత​కి ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడ.


దేశసేవకు ఇంటికొకరు 

మహారాష్ట్రలోనే మరో మిలటరీ ఊరు అప్షింఘె. ఇది సతారా జిల్లాలో ఉంది. ఈ ఊళ్లో ఇంటికొకరు చొప్పున ఆర్మీలో చేరతారు. మొదటి ప్రపంచయుద్ధంలో 46 మంది వీర మరణం పొందారు. వాళ్ల గుర్తుగా ఊళ్లో మెమోరియల్ కట్టారు. గ్రామంలో వ్యవసాయం చాలా తక్కువ. దీనికి కారణం.. ప్రతి ఇంటి నుండి కనీసం ఒక యువకుడు భద్రతా దళాలకు వెళ్తాడు. కొన్ని ఇండ్లలో ఆరుగురి వరకు సైన్యంలో లేదా ఇతర భద్రతా దళాలలో పనిచేస్తున్నారు. ఇందుకోసం స్కూల్​ నుంచే పిల్లలకు ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్నారు. రికార్డుల ప్రకారం, స్వాతంత్ర్యం రాకముందు వచ్చిన అన్ని యుద్ధాల్లోనూ ఈ ఊరి ప్రజలు పాల్గొన్నారు. ఇతర భద్రతా దళాల్లో జిల్లాకు చెందిన సైనికులు పెద్ద సంఖ్యలో సేవలందిస్తున్నారు.

గహ్మర్​లో ఆర్మీ క్రేజ్

ఉత్తరప్రదేశ్​లోని ఘాజీపుర్ జిల్లాలో గహ్మర్ అనే గ్రామం ఉంది. ఈ ఊళ్లో ఇంటికి ఒకరుచొప్పున దాదాపు18 వేల మంది సైన్యంలో ఉన్నారు. పది వేల మంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 220 మందికి పైగా సైన్యంలో చేరారు.


అటస్​లో ఆల్కహాల్ బంద్​

ఆగ్రాకి దగ్గరలో అటస్ అనే ఊరు ఉంది. ఈ ఊళ్లో దాదాపు 800 వంది యువ సైనికులు సైన్యంలో పనిచేస్తున్నారు. ఇప్పటికే 200 మంది రిటైర్డ్ సైనికులున్నారు. ఈ ఊరి వాడైన దశరథ్ సింగ్ అనే ఆర్మీ జవాను పాకిస్తాన్ చేతిలో వీర మరణం పొందాడు. అప్పటి నుంచి ఈ ఊరి వాళ్లకి యుద్ధంలో చేరాలనే ఆశ రేకెత్తింది. మనదేశంలో ఉన్న ఆర్మీ విలేజ్​లన్నింటిలో ఆల్కహాల్, స్మోకింగ్ బ్యాన్ చేసిన ఏకైక విలేజ్ అటస్. ఎవరైనా తాగినట్టు తెలిస్తే వాళ్లకు శిక్ష వేసి, జరిమానా విధిస్తారు. సమాచారం ఇచ్చిన వాళ్లకి పంచాయతీ రివార్డు ఇస్తుంది. ఇది చూసి చుట్టుపక్కల ఊళ్లు కూడా ఈ రూల్స్ ఫాలో అవుతున్నాయి.

కమ్మవానపెట్టై కాదు.. రనువపెట్టై

తమిళనాడులోని వెల్లూరు​ జిల్లాలో మిలటరీ ఊరిగా పేరుగాంచింది కమ్మవనపెట్టై గ్రామం. ఆ ఊరి వాళ్లలో చాలామంది 70 ఏండ్లకు ముందు నుంచే సైన్యంలో పనిచేస్తున్నారు. ఇదేకాకుండా దీని పక్కనే ఉన్న పెనతుర్, కట్టపుడుర్ గ్రామాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. రెండో ప్రపంచయుద్ధం మొదలు కార్గిల్ వార్ వరకు సేవలందించారు. కమ్మవనపెట్టై నుంచి నూటికి తొంభై శాతం ఆర్మీలోనే ఉంటారు. అందుకే దీన్ని ‘రనువపెట్టై’ అని పిలుస్తుంటారు. అంటే ‘ఆర్మీ విలేజ్’ అని అర్థం. ఇలా చెప్పుకుంటూ పోతే, కర్నాటకలోని ఇచల్ గ్రామం, తమిళనాడులోని తిప్పనపల్లి, ఒడిశాలోని అంబకుడుచి... దేశంలో ఎన్నో ఊళ్లు, ఎన్నెన్నో కుటుంబాలు తమవాళ్లని సైన్యంలో చేరేందుకు ఎంకరేజ్​ చేశాయి. చేస్తూనే... ఉన్నాయి.