
న్యూఢిల్లీ: 2027 నాటికి 50 వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాతో జాయింట్ ఫైనాన్స్ మెకానిజం సహాయంతో వీటిని రోడ్లు ఎక్కించనుంది. బస్సుల ఉత్పత్తిని విస్తరించేందుకు తయారీదారులకు 390 మిలియన్ డాలర్ల ఫండ్‌ను అందుబాటులోకి తెస్తామని భారత, అమెరికా అధికారులు తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం 12,000 ఈ-–బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. అమెరికా ప్రభుత్వంతోపాటు దాతృత్వ సంస్థల నుంచి 150 మిలియన్ డాలర్లు, భారత ప్రభుత్వం నుంచి 240 మిలియన్ డాలర్లతో ఫండ్ ఏర్పాటు చేస్తారు.
ఎలక్ట్రిక్ బస్సుల ధరలను తగ్గించేందుకు భారత్ కృషి చేస్తోంది. ప్రభుత్వం గతంలో "రవాణాగా సేవ" అనే భావనను ప్రవేశపెట్టింది. దీని ద్వారా తయారీదారులు ప్రభుత్వ సంస్థలకు బస్సులను అద్దెకు ఇస్తారు. 12 సంవత్సరాల పాటు నెలవారీ చెల్లింపులను తీసుకుంటారు. అంతిమంగా ఈ విధానం తయారీదారులకు నష్టాలనే మిగులుస్తోంది. అందుకే ప్రభుత్వం కొత్త ఫండ్ మెకానిజంను తీసుకువస్తోంది. ఇక నుంచి తయారీదారులకు తాజా పెట్టుబడులకు ఫైనాన్స్ దొరకడం వల్ల వారి నష్టాలు తగ్గుతాయి.