
పాట్నా: ఇండియా కూటమిలోని పార్టీల అధ్యక్షుల మీటింగ్ వాయిదా పడింది. బుధవారం ఢిల్లీలో మీటింగ్ జరగాల్సి ఉండగా, దాన్ని వాయిదా వేసినట్టు ఆర్జేడీ ప్రెసిడెంట్ లాలూప్రసాద్ యాదవ్ తెలిపారు. మంగళవారం బీహార్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ఇండియా కూటమి మీటింగ్ ను వాయిదా వేశాం. ఆ మీటింగ్ఈ నెల 17న ఉంటుంది” అని లాలూ చెప్పారు. మరోవైపు ఇండియా కూటమి కోఆర్డినేషన్ మీటింగ్ మాత్రం బుధవారం కొనసాగుతుందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ గుర్దీప్ సింగ్ సప్పల్ తెలిపారు. ‘‘ఇండియా కూటమిలోని అన్ని పార్టీల పార్లమెంటరీ పార్టీ లీడర్ల కోఆర్డినేషన్ మీటింగ్ బుధవారం కొనసాగుతుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో సాయంత్రం 6 గంటలకు మీటింగ్ ఉంటుంది.
ఇండియా కూటమిలోని పార్టీల అధ్యక్షుల మీటింగ్ ను డిసెంబర్ మూడో వారంలో అందరికీ అనుకూలమైన రోజు నిర్వహిస్తాం” అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఇండియా కూటమి మీటింగ్ కు హాజరుకాలేమంటూ ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్ చెప్పడంతో మీటింగ్ ను వాయిదా వేసినట్టు సమాచారం.