విదేశీ పర్యాటకులకు భారత్ గ్రీన్ సిగ్నల్

విదేశీ పర్యాటకులకు భారత్ గ్రీన్ సిగ్నల్
  • నవంబర్ 16 నుంచి టూరిస్టు వీసాల జారీ
  • చార్టెర్డ్ విమానంలో వచ్చే వారికి అక్టోబర్ 15 నుంచే వీసాలు జారీ

న్యూఢిల్లీ: భారత్ కు ఎప్పుడెప్పుడు రావాలా..? అని ఎదురు చూస్తున్న పర్యాటకులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల అంటే నవంబర్ 16 నుంచి విదేశీ పర్యాటకులు భారత్ సందర్శించేందుకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖ స్థాయిలోని వారు చార్టెర్డ్ ఫ్లయిట్లలో వచ్చే వారికి ఈనెల 15 నుంచే టూరిస్టు వీసాలు జారీ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. 
గత ఏడాది మార్చి 22న భారత దేశంలో జనతా కర్ఫ్య్పూ విధించిన తర్వాత.. అంటే కరోనా మహమ్మారి ప్రబలిన నాటి నుంచి విదేశీ పర్యాటకులే కాదు విదేశీ ప్రయాణికుల విమానాలను కూడా నిలిపేసిన విషయం తెలిసిందే. కరోనా నియంత్రణ కోసం కఠినమైన ఆంకషలు అమలు చేశారు. తర్వాత సరుకుల రవాణా విమానాలు.. ప్రత్యేక ఒప్పందాల దేశాలతో మాత్రమే ప్రయాణికుల విమానాలు నడుస్తున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా పూర్తిగా అదుపులోకి రావడంతో.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపధ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
విదేశీయులు ముఖ్యంగా టూరిస్టులు భారత సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే దేశంలో పర్యటించేలా మార్గదర్శకాలు అమలు చేయాలని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు విదేశీ పర్యాటకుల కోసం మార్గదర్శకాలు అమలు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది.