
ఇయ్యాల ఢిల్లీలో సమావేశమవనున్న ఇండియా కూటమి నేతలు
ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదు: ఖర్గే
తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కాంగ్రెస్ గొప్పగా పోరాడింది
రాజ్యాంగాన్ని కాపాడే పోరాటంలో ఇది పెద్ద విజయం: రాహుల్
మోదీ.. అదానీ మధ్య రిలేషన్స్టాక్మార్కెట్చెప్పింది
పదేండ్ల మోదీ, షా పాలనను ప్రజలు సమర్థించలేదని వెల్లడి
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పని.. ఇది ఆయనకు ‘రాజకీయ, నైతిక ఓటమి’ అని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. బుధవారం ఇండియా కూటమి పార్టీలతో సమావేశమై కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై పాత మిత్రులైన టీడీపీ, జేడీయూను సంప్రదించాలా వద్దా అనే విషయంపై చర్చిస్తామని తెలిపింది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇండియా కూటమి పక్షాలు సమావేశం తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఖర్గే, రాహుల్ సమాధానం ఇచ్చారు. ఇండియా కూటమి.. ప్రస్తుతం ఎన్డీఏ గూటిలో ఉన్న పాత మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తుందా అని ప్రశ్నించగా.. “మేము బుధవారం మా భాగస్వాములతో సమావేశం కాబోతున్నాం. ఈ ప్రశ్నలన్నింటికి అక్కడ సమాధానం దొరుకుంతుంది .. మా మిత్రపక్షాల అభిప్రాయం తీసుకోకుండా మేం దీనిపై ఏం మాట్లాడం. మా కూటమి ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానిపై ముందుకు సాగుతం’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఇండియా కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉందా అనే ప్రశ్నకు ‘‘ఇండియా కూటమి పక్షాలు, కొత్తగా చేరే భాగస్వాములతో మాట్లాడకుండా మేము ఎలా చెప్పగలం? నేను ఇక్కడ అన్ని వ్యూహాలను వెల్లడిస్తే, మోదీ జీ అలర్ట్ అవుతారు” అని ఖర్గే చెప్పారు.
ఖర్గే మాట్లాడుతూ.. ‘‘ఈ రిజల్ట్ ప్రజలు, ప్రజాస్వామ్య విజయం. ఇది ప్రజలకు మోదీకి మధ్య జరుగుతున్న పోరాటమని మేం ముందు నుంచి చెబుతూనే ఉన్నాం. ప్రజలు ఇచ్చిన తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నం. ఓటర్లు ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు” అని అన్నారు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కాంగ్రెస్, ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేశాయని, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను చేజిక్కించుకొని తమకు అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ ప్రచారం చేసిన అబద్ధాలను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ‘‘మా బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకున్నారు. మా నాయకులపై దుష్ప్రచారం చేశారు. అయినప్పటికీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులు, కార్మికుల కష్టాలు, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం వంటి సమస్యలను లేవనెత్తుతూ కాంగ్రెస్ ఎన్నికల్లో పోరాడింది’’ అని చెప్పారు. మోదీకి మరోసారి అధికారం ఇస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడి మరింత పెరుగుతుందని ప్రజలు నమ్ముతున్నట్టు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
పేద, బడుగు బలహీన వర్గాలు అండగా నిలిచాయి: రాహుల్
రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడే దిశగా తొలి, అతి పెద్ద అడుగు వేశామని, పేదలు, బడుగు బలహీన వర్గాలు తమకు అండగా నిలిచాయని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ దేశ ప్రజలందరూ ఉద్యమిస్తారని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. కాంగ్రెస్, ఇండియా కూటమికి పేదలు చాల స్పష్టమైన విజన్ ఇచ్చారని.. వారు రాజ్యాంగాన్ని కాపాడారని అన్నారు. ‘‘గత పదేండ్లలో నరేంద్ర మోదీ, అమిత్ షా రాజ్యాంగంపై చేసిన దాడిని ఒప్పుకోవడం లేదని ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు చెప్పారు. అలాగే ఆ ఇద్దరు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన తీరును సమర్థించలేదు’’ అని అన్నారు.
బీజేపీ సీట్లు తగ్గడం, అదానీ షేర్లు పడిపోవడంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రజలు ప్రత్యక్షంగా తెలుసుకున్నరు. మోదీజీ ఓడిపోతే అదానీ కూడా పోతారని స్టాక్ మార్కెట్ చెబుతున్నది. ఇక్కడ అవినీతి రిలేషన్ స్పష్టంగా కనిపిస్తున్నది” అని అన్నారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ఓటర్లకు రాహుల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వయనాడ్, రాయ్‌బరేలీ సీట్లతో ఎక్కడ కొనసాగాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.