తగ్గనున్న నిరుద్యోగం .. పెరగనున్న జీడీపీ

తగ్గనున్న నిరుద్యోగం .. పెరగనున్న జీడీపీ
  • 2028 నాటికి మరింత అభివృద్ధి
  • వెల్లడించిన ఓఆర్ఎఫ్​ రిపోర్ట్

న్యూఢిల్లీ: మనదేశ ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నందున నిరుద్యోగిత రేటు 97 బేసిస్ పాయింట్లు తగ్గి, ఉపాధి మరింత పెరుగుతుందని ఒక కొత్త రిపోర్ట్​ మంగళవారం తెలిపింది. నిరుద్యోగిత రేటు 2024లో 4.47 శాతం నుంచి 2028లో 3.68 శాతానికి తగ్గుతుందని థింక్‌‌‌‌ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్​ఎఫ్​) ఇండియా ఎంప్లాయ్‌‌‌‌మెంట్ ఔట్‌‌‌‌లుక్ 2030 రిపోర్ట్​ తెలిపింది. దీని ప్రకారం.. కరోనా తరువాత దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది.

భారతదేశ ఉద్యోగ మార్కెట్ ఎదుగుతోంది. దేశంలోని యువ జనాభా ఆర్థిక విస్తరణకు దన్నుగా నిలుస్తోంది. 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటుతో, భారతదేశం 2026-–27 నాటికి  ఐదు -ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యాన్ని సాధించగలుగుతుంది. ఇందుకు బలమైన ప్రైవేట్ వినియోగం,  ప్రభుత్వ పెట్టుబడులు చాలా ముఖ్యం. మనదేశ జీడీపీ  పరిమాణం 2024లో నాలుగు ట్రిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. దేశంలోని 60 కోట్ల మంది యువజనాభా వృద్ధికి ఇంజన్​గా పనిచేస్తుంది.  దేశం తన  ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడంతో, మొత్తం ఉపాధి 22 శాతం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగం 2028 నాటికి 97 బేసిస్ పాయింట్లు తగ్గుతుంది. 

సేవారంగం ఎంతో కీలకం...

సేవా రంగం భారీ సంఖ్యలో ఉద్యోగాలను ఇవ్వనుంది. ప్రతి కొత్త యూనిట్ వల్ల ఉపాధి కనీసం 0.12 శాతం పెరుగుతుంది. ముఖ్యంగా డిజిటల్ సేవలు, ఆర్థిక సేవలు  ఆరోగ్యం, ఆతిథ్యం, కన్జూమర్​ రిటైల్, ఈ–-కామర్స్,  పునరుత్పాదక శక్తికి సంబంధించిన కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావొచ్చు. ఎంఎస్​ఎంఈలు,  స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలు వేగవంతమైన వృద్ధికి సాయపడుతాయి. 

అభివృద్ధి చెందుతున్న సేవారంగం మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించే అవకాశాలు ఉన్నాయి.  ఈ రిపోర్ట్​ రచయితలలో ఒకరైన నీలాంజన్ ఘోష్ మాట్లాడుతూ ఉపాధి కల్పనకు కొత్త వ్యవస్థాపకులు కీలకమని చెప్పారు. భారతదేశ  స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే శక్తి వీరికి ఉందన్నారు.