ఇలాంటి విషయాల్లో..భారత్​కూ మినహాయింపు లేదు

ఇలాంటి విషయాల్లో..భారత్​కూ మినహాయింపు లేదు

వాషింగ్టన్/టొరంటో : కెనడాలో ఖలిస్తాన్ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందన్న ఆరోపణలపై అమెరికా తన స్వరం మార్చింది. నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత అమెరికా స్పందిస్తూ.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, గురువారం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ మీడియాతో మాట్లాడుతూ మిత్ర దేశం కెనడాను బుజ్జగించేలా మాట మార్చారు.

‘‘ఇలాంటి ఆరోపణల విషయంలో ఏ దేశానికీ ప్రత్యేక మినహాయింపు ఉండదు. అమెరికా తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుంది. దీనివల్ల ఏ దేశంపై ప్రభావం పడుతుందన్నది పట్టించుకోం. దీనిపై మేం సీరియస్ గా ఉన్నాం” అని ఆయన అన్నారు.  

నిఘా సమాచారం ఉందన్న కెనడా మీడియా 

నిజ్జర్ హత్య వెనుక ఇండియన్ గవర్నమెంట్ హస్తం ఉందనేదానిపై ‘ఫైవ్ ఐస్’ కూటమిలోని ఓ దేశం సమాచారం అందించిందని కెనడాకు చెందిన సీబీఎస్ న్యూస్ చానెల్ ఓ కథనం ప్రసారం చేసింది. కెనడాలో ఇండియన్ ఏజెంట్లు, డిప్లమాట్స్ మధ్య సంభాషణలను ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించాయని తెలిపింది.