చైనా ఆర్మీని ఖాళీ చేయించ‌డానికి యుద్ధం డిక్లేర్ చేశారా? అమిత్ షాకి ఒవైసీ ప్ర‌శ్న‌

చైనా ఆర్మీని ఖాళీ చేయించ‌డానికి యుద్ధం డిక్లేర్ చేశారా? అమిత్ షాకి ఒవైసీ ప్ర‌శ్న‌

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లోని గాల్వ‌న్ లోయ వ‌ద్ద ఇరు దేశాల సైనికుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌ నేప‌థ్యంలో చైనా ఆర్మీని అక్క‌డి నుంచి ఖాళీ చేయించ‌డానికి యుద్ధం డిక్లేర్ చేశారా అని ప్ర‌శ్నించారు హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ చీఫ్ అస‌దుద్దీన్ ఒవైసీ. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీడియా ఏజెన్సీ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇండియా రెండు యుద్ధాల్లోనూ గెలిచి తీరుతుంద‌ని అన్నారు. క‌రోనాపై పోరాటంతో పాటు తూర్పు ల‌ఢ‌ఖ్‌లోని ఉద్రిక్త‌త‌ల విష‌యంలోనూ విజ‌యం సాధిస్తామ‌ని చెప్పారు. ఆయ‌న మాట్లాడిన వీడియోను ట్వీట్ చేస్తూ.. చైనాపై యుద్ధం చేస్తున్నారా అని ప్ర‌శ్నించారు ఒవైసీ. “సార్ అమిత్ షా.. గాల్వ‌న్ లోయ‌, హాట్ స్పింగ్స్, డిప్సాంగ్, ప్యాంగాంగ్ ట్సో ప్రాంతాల నుంచి చైనా ఆర్మీని వెన‌క్కి పంపేందుకు వార్ డిక్లేర్ చేశారా?” అని కేంద్ర హోం మంత్రిని ప్ర‌శ్నించారు. అలాగే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న మ‌న్ కీ బాత్ ప్ర‌సంగంలో చైనా పేరును గానీ, ఆ దేశ ఆర్మీని గానీ ప్ర‌స్తావించ‌కుండా దీటుగా స‌మాధాన‌మిచ్చామ‌ని అన్నార‌ని, దీనిపై క్లారిటీ ఇవ్వాల‌ని ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యాన్ని కోరుతూ పీఎంవో అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్‌కు ట్యాగ్ చేశారు ఒవైసీ.

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లోని గాల్వ‌న్ లోయ‌లో జూన్ 15న రాత్రి చైనా సైనికులు మ‌న దేశ భూభాగంలోకి ప్ర‌వేశించ‌డంతో భార‌త జ‌వాన్లు అడ్డుకున్నారు. ఈ స‌మ‌యంలో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో క‌ల్న‌ల్ సంతోష్ స‌హా 20 మంది భార‌త సైనికులు అమ‌రుల‌య్యారు. చైనా సైనికుల‌ను మ‌న భూభాగంలో నుంచి త‌రిమికొట్టే క్ర‌మంలో ఆ దేశానికి చెందిన 40 మందికి పైగా జ‌వాన్లు మ‌ర‌ణించారు. ఈ సంఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ మాతృభూమిపై క‌న్నేసిన వారికి మ‌న వీర జ‌వాన్లు దీటుగా జ‌వాబిచ్చార‌ని, కానీ ఆ పోరాటంలో 20 మంది సైనికులు అమ‌రుల‌య్యార‌ని అన్నారు.