మా దేశ అవసరాలను బట్టే నిర్ణయాలు తీసుకుంటం.. ట్రంప్‎కు ఇండియా కౌంటర్

మా దేశ అవసరాలను బట్టే నిర్ణయాలు తీసుకుంటం.. ట్రంప్‎కు ఇండియా కౌంటర్

న్యూఢిల్లీ: రష్యా నుంచి ఇండియా ఆయిల్, వెపన్స్ కొనుగోలుపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అక్కసు వెళ్లగక్కిన నేపథ్యంలో ఈ విషయంలో తమ ఇంధన అవసరాలను బట్టే నిర్ణయాలు ఉంటాయని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికాతో సంబంధాలు, ట్రంప్ టారిఫ్‎ల అంశంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. 

‘‘మా ఇంధన అవసరాలను తీర్చుకునే విషయంలో దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్‏లో లభించే ఆఫర్‎ను బట్టి నిర్ణయాలు తీసుకుంటాం” అని ఆయన తేల్చి చెప్పారు. అయితే, అమెరికా, భారత్ సంబంధాలు ఎన్నో సవాళ్లను, మార్పులను దాటుకుని వచ్చాయని జైస్వాల్ అన్నారు.

మాపై అమెరికాది బ్యాలెన్స్‎డ్ టారిఫ్.. మా ఎకానమీ బలోపేతం అవుతుంది: పాక్

తమ దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ విధించిన 19 శాతం టారిఫ్  బ్యాలెన్స్‎డ్‎గా ఉందని, తాజా సుంకాలతో తమ ఎకానమీ బలోపేతం అవుతుందని పాకిస్తాన్ పేర్కొంది. యూఎస్ విధించిన సుంకాలు ఆశాజనకంగా ఉన్నాయని పాక్  విదేశాంగ శాఖ పేర్కొంది. ఇంతకుముందు 29% ఉన్న  టారిఫ్‎లను ట్రంప్  తాజాగా 19 శాతానికి తగ్గించారని, దీనిని స్వాగతిస్తున్నామని వెల్లడించింది. 

‘‘ఇకపై అమెరికా మార్కెట్‎లోకి ఎగుమతి అయ్యే పాకిస్తాన్ వస్తువులకు 19% టారిఫ్  వర్తిస్తుంది. ఈ టారిఫ్‎తో సౌత్, ఆగ్నేయాసియా దేశాలకు పాక్ మరింత పోటీ ఇస్తుంది. అమెరికాకు మా దేశ ఎగుమతులు పెరుగుతాయి. మా దేశ ఎకానమీకి వెన్నెముక అయిన టెక్స్ టైల్స్  వంటి కీలక రంగంలో ఎక్స్‎పోర్టులు పెరిగి మా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది” అని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది.