Cricket World Cup 2023: గెలిచి 20 ఏళ్లు అవుతోంది.. ఈ సారైనా న్యూజిలాండ్‌ను ఓడిస్తారా..?

Cricket World Cup 2023: గెలిచి 20 ఏళ్లు అవుతోంది.. ఈ సారైనా న్యూజిలాండ్‌ను ఓడిస్తారా..?

సాధారణంగా న్యూజిలాండ్ తో పోలిస్తే టీమిండియా చాలా పటిష్టమైన జట్టు. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా ఏ విభాగం చూసుకున్నా బలంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. కానీ ఐసీసీ టోర్నీకి వచ్చేసరికే మాత్రం కివీస్ ఆట మరోలా ఉంటుంది. గత పదేళ్లుగా కివీస్ ప్రస్తానం చూసుకుంటే టైటిల్ గెలిచినా, గెలవకపోయినా  నాకౌట్ కి ఖచ్చితంగా వెళ్తుంది. అయితే ఈ క్రమంలో భారత్ కి మాత్రం పీడకలగా మారింది. ఎన్నో బాధాకర సంఘటనలను మిగిల్చింది. 

ఫార్మాట్ ఏదైనా ఐసీసీ టోర్నీలో కివీస్ తో మ్యాచ్ అంటే చాలు మన ఆటగాళ్లు ఓడిపోవడం అలవాటుగా చేసుకున్నారు. చివరిసారిగా 2003 వన్డే ప్రపంచ కప్ లో న్యూజీలాండ్ మీద నెగ్గిన భారత్ ఆ తర్వాత గెలుపు రుచి చూడలేదు. 2007,2016,2021 టీ 20 వరల్డ్ కప్ లో పరాజయాల్ని చవి చూసిన భారత్.. 2021లో జరిగిన టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోను ఓడింది. ఇక 2019 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ ని ఫైనల్ కివెళ్ళకుండా అడ్డుకున్నారు. 20 ఏళ్లుగా ఆ జట్టుపై ఓడిపోవడం సగటు భారత అభిమాని జీర్ణించుకోలేకపోతున్నారు. 

అయితే బ్లాక్ క్యాప్స్ మీద నెగ్గడానికి రోహిత్ సేనకు మరో అవకాశం వచ్చింది. వరల్డ్ కప్ ఓ భాగంగా రేపు ధర్మశాలలో మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో మ్యాచ్ జరగడం, భారత ఆటగాళ్లు అందరూ ఫామ్ లో ఉండడంతో ఈ సారి విజయంపై ఇండియన్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.  పైగా కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియంసన్ కూడా జట్టుకి దూరం కావడం భారత్ కి అనుకూలంగా మారనుంది. అయితే ఈ మ్యాచ్ కు భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య లేకపోవడం భారత్ విజయవకాశాలను ఎంతవరకు దెబ్బ తీస్తుందో చూడాలి.     

ప్రస్తుతం రెండు జట్లు కూడా బలంగానే ఉన్నాయి. ఆడిన నాలుగు మ్యాచుల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు గెలిచి ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఓటమి లేకుండా అజేయంగా నిలిచాయి. సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో 20 ఏళ్ళ ఓటములకు కివీస్ పై ప్రతీకారం తీర్చుకుంటుందో లేకపోతే అలవాటుగా కివీస్ కి మరో విజయాన్ని అందిస్తారో తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.