గ్లోబల్ ట్రేడ్ లో చైనాను దాటుతం!

గ్లోబల్ ట్రేడ్ లో చైనాను దాటుతం!

ప్రతీ సంక్షోభం ఓ అవకాశం ఇస్తుంది. దాన్ని అందిపుచ్చుకునేవారు ప్రయోజనం పొందుతారు. గ్లోబల్  ట్రేడ్ లో చైనా పెత్తనం, ఇన్నేండ్లుగా సాగిస్తున్న ఏకపక్ష ధోరణులకు ముగింపు పలికే సమయం వచ్చింది. ప్రపంచమంతా మాంద్యం వైపు పయనిస్తున్న వేళ చైనాలో కరోనా వైరస్  మొదలైంది. అమెరికా వంటి దేశాలు చైనా ల్యాబ్  నుంచే వైరస్ అంటూ కత్తులు దూస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఫైన్లు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో తయారీరంగం, భారీ ట్రేడ్  సెంటర్ గా దశాబ్దాలుగా చైనా నిర్మించుకున్న ఇమేజ్, విశ్వసనీయత కుదేలవుతోంది. కరోనాపై పోరాటంలో మిగిలిన దేశాల మాదిరిగానే ఇండియా కూడా తీవ్రంగా కృషి చేస్తోంది. ఎకానమీని గాడి తప్పేలా చేసిన చైనా తీరుపై ఇండియా కూడా అసంతృప్తితో ఉంది. అయినా తీవ్ర నష్టం జరగకుండా నియంత్రించగలిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్  ట్రేడ్ లో చైనాను పడగొట్టి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఇండియా ఎదగగలదనే మాట ఇప్పుడు ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే అనేక చారిత్రక నిర్ణయాలతోపాటు వినూత్న విధానాలు చేపట్టాల్సి ఉంటుంది. తయారీ రంగం, గ్లోబల్  ట్రేడ్  పరంగా చైనా స్థాయిలో ఇండియా నిలవాలంటే ముందుగా ఆ దేశ ప్రగతి విధానాన్ని పూర్తిగా స్టడీ చేసి మన అవసరాలకు తగినట్టు మార్చుకోవాలి.

జాతీయ విలువల మంత్రిత్వశాఖ

సానుకూల, ప్రభావవంతమైన ఫలితాలు సాధించేందుకు అన్ని సామాజిక,- ఆర్థిక స్థాయిల్లోని పౌరుల్లో జాతీయ విలువలను పెంచాలి. ఇందుకోసం తగిన బడ్జెట్ కేటాయింపులతో మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి. శ్రామిక శక్తిలో అన్ని స్థాయిల్లో నిపుణులను కలిగి ఉండేందుకు పని సంస్కృతి, జవాబుదారీతనం, సమయపాలన, ఫలితాలు రాబట్టే తత్వం, సృజనాత్మకత వంటి విలువలను పెంపొందించుకోవాలి. భారీ తయారీ, వాణిజ్య కేంద్రంగా ఎదగాలంటే నైపుణ్యం, పని సంస్కృతిని ప్రేమించే శ్రామికశక్తి అవసరం.

అవినీతిరహిత పాలన, చట్టాల అమలు

అవినీతిని మట్టుబెట్టకపోతే ప్రపంచంలోనే అతి పెద్ద తయారీ కేంద్రంగా, వాణిజ్య దేశంగా ఎదగలేం. పటిష్టమైన అవినీతి నిరోధక చట్టాలు, అవినీతికి తావులేని సంస్థలు, వేగవంతమైన విచారణలు, తీర్పులు లేకుంటే ఏ దేశం కూడా అంతర్జాతీయ తయారీ కేంద్రంగా నాణ్యమైన వస్తు సేవలు అందించలేదు. రాజకీయ సంకల్పం, సంస్థాగతమైన చట్టాలు రూపొందించి భారీ సంస్కరణల దిశగా కదలాలి. కమ్యూనిస్టు పాలనలో ఉన్న చైనా మాదిరిగా జాతీయ విధానాలు కొనసాగించడమన్నది ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో కుదరదు. రాజ్యాంగపరమైన పరిమితులు సవాలుగా నిలుస్తాయి. 2 దశాబ్దాల పాటు మార్చడానికి వీల్లేని చట్టాలు, విధానాలతో కూడిన రాజ్యాంగ వ్యవస్థను రూపొందించుకుంటే తప్ప పారిశ్రామీకరణ వైపు దేశం అడుగులు వేయలేదు.

ఉచితాలతో సోమరులుగా మార్చారు

కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న చైనా తనను తాను సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పుకుంటుంది. కానీ ఎక్కడా సోషలిస్టు సంక్షేమ చర్యలు కానరావు. కానీ నిజమైన సామ్యవాద సిద్ధాంతాలను ఇండియా అట్టడుగు స్థాయి నుంచి అమలు చేస్తోంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఇండియా దూకుడుతో కూడిన సోషలిజాన్ని అందిపుచ్చుకుంటోంది. ఉచితాలతో సగం దేశ జనాభాను సోమరులుగా మార్చి వారి నుంచి పారిశ్రామిక ప్రగతిని ఆశించడం దురాశే. శ్రమించే కేపిటలిస్ట్ దేశంగా ఉన్న అమెరికా.. తన సహజ శ్రమించే లక్షణాన్ని కోల్పోయి ఇప్పుడు సోమరితనంతో కూడిన సామ్యవాద దేశంగా మారిపోయింది. 3 దశాబ్దాల క్రితం వరకు సృజనాత్మక, నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి అమెరికా పేరుగాంచింది. కానీ ఇప్పుడు టాయిలెట్ పేపర్ సహ ప్రతీ దానికి అమెరికా పూర్తిగా చైనాపైనే ఆధారపడుతోంది. దురదృష్టవశాత్తు ప్రజాకర్షక రాజకీయాలతో ఏర్పడిన రాజకీయాల కారణంగా ఇండియా కూడా అటువంటి సామ్యవాదం దిశగా అడుగులు వేస్తోంది. ఇండియా తెలివైనదైతే అమెరికా తరహా విధానాలకు లొంగిపోకుండా వ్యవహరించాలి.

భారీ తయారీ – భారీ సరఫరా

దేశంలో ప్రాథమిక, ఉన్నత, వృత్తి విద్య ఇలా అంతా పూర్తిగా మార్చేయాలి. నైపుణ్యం అన్నది కొత్త విద్యా విధానంలో కీలకంగా ఉండాలి. సామాజికంగా, ఆర్థికంగా సమాజంలోని అడుగున ఉండే 30% యువతను, భవిష్యత్ తరాలను పారిశ్రామికంగా వర్గీకరించి, ఆయా రంగాలవారీగా నైపుణ్యాన్ని అందించలేకపోతే తయారీ, వాణిజ్య రంగాల్లో అంతర్జాతీయంగా చైనాకు ఇండియా సవాల్ విసరలేదు. అంతర్జాతీయ డిమాండ్ కు తగ్గట్టుగా ఒక ఉత్పత్తి లేదా వివిధ ఉత్పత్తులను తయారు చేసి షెడ్యూల్ ప్రకారం ఎగుమతి చేసే సామర్థ్యం కలిగిన భారీ సంస్థలు ఇండియాలో లేవు. దేశీయ అవసరాల కోసం ఇప్పుడు ఇండియా కూడా చైనాపైనే ఆధారపడుతోంది. వేగవంతంగా నిర్ణయాలు తీసుకోకపోతే పూర్తిగా చైనాపైనే ఆధారపడాల్సిన రోజులు రావొచ్చు. చైనాను అధిగమించేలా “వ్యూహాత్మకంగా అమలు చేయగలిగే విజయ ప్రణాళిక”ను ఇండియా రూపొందించుకోవాలి. గ్లోబల్ గా డిమాండ్ ఉండే రంగాలను ఎంచుకుని వ్యూహాత్మకంగా భారీ పెట్టుబడులు పెట్టి నిర్వహణ, ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాలి. చైనా సరఫరా చేసే దేశాల నుంచి డిమాండ్ ను కొద్దిగా కొద్దిగా అందుకుంటూ నాణ్యత, ధర, విశ్వసనీయత ప్రమాణాలను ఉన్నతంగా అమలు చేస్తూ క్రమంగా ఆ దేశాన్ని పడదోయాలి.

ప్రోత్సాహాలు ఇవ్వాలి

తయారీ రంగ సామర్థ్య విస్తరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వడమే కాదు.. ఎగుమతి ఆర్డర్లు సంపాదించుకుని సకాలంలో సరఫరా చేస్తూ మచ్చలేని రికార్డు కలిగిన OEM(ఒరిజినల్ ఈక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్)లకు తగిన బహుమతులు ఇవ్వాలి. ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించాలి. “ఏ ధరలలోనైనా నాణ్యత” ఉంటుందని భరోసా ఇవ్వగలిగితే అన్ని దేశాలు ఇండియా ముందు క్యూ కడతాయి. అంతర్జాతీయ వ్యాపారం పుంజుకునేంత వరకు కస్టమర్ సంతృప్తి లేదా కనీసం కస్టమర్ సంతోషం అనే నినాదంతో కొత్త తయారీ వ్యవస్థకు ఇండియా కృషి చేయాలి. కస్టమర్ అనుకూల నైతిక ప్రమాణాలు పాటించడమన్నది ఓ సిద్ధాంతంగా తయారీదారులు, వ్యాపారవేత్తలు అమలు చేయాలి. ఈ విషయంలో వారు నిజాయితీగా, విశ్వసనీయతతో సందర్భానికి తగినట్టుగా వ్యవహరిస్తే తదుపరి తయారీ దిగ్గజంగా ఇండియా ఎదుగుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించగలిగితే దేశంలోని వంద కోట్లకుపైగా ఇండియన్స్  ఆర్థిక, సామాజిక జీవితాలను అది  నేరుగా ప్రభావితం చేస్తుంది.