
- మోదీ తెలివైన, బ్యాలెన్స్డ్ లీడరని ప్రశంసలు
- రష్యా, భారత్‌ది ప్రత్యేక బంధమని వెల్లడి
మాస్కో: రష్యా నుంచి క్రూడాయిల్ కొనకుండా భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా డిమాండ్లను ఇండియా కేర్ చేయదని, ఎవ్వరి ముందూ తల వంచదని అన్నారు. రష్యాలోని సోచిలో జరుగుతున్న వల్దాయ్ డిస్కషన్ క్లబ్ ప్లీనరీ సెషన్లో పుతిన్ మాట్లాడారు. రష్యా, భారత్‌ది బలమైన బంధమని పేర్కొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలివైన, బ్యాలెన్స్డ్ లీడర్ అని కొనియాడారు. ‘‘రష్యా నుంచి క్రూడాయిల్ కొనాలన్న భారత నిర్ణయం పూర్తిగా ఆ దేశ ఆర్థిక వ్యవహారానికి సంబంధించినది. ఆ విషయంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశంలేదు. మా దగ్గర ఇంధనం కొనకుంటే ఇండియా నష్టపోతుంది. దాదాపు రూ.80 లక్షల కోట్ల నష్టం రావచ్చని అంచనా.
రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటే ఇండియాపై ఆంక్షలు విధిస్తారు. అప్పుడు కూడా నష్టాలు ఒకేవిధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో దిగుమతులు ఆపడం ఎందుకు?” అని పుతిన్ వ్యాఖ్యానించారు. అమెరికా టారిఫ్‌ల వల్ల భారత్‌కు నష్టాలు వస్తున్నాయని, తమ దేశం నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవడం ద్వారా ఆ నష్టాలను ఇండియా భర్తీ చేసుకుంటుందన్నారు.
అమెరికా టారిఫ్‌లతో అంతర్జాతీయంగా ధరలు పెరిగే అవకాశం ఉందని, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, సోవియట్ యూనియన్ కాలం నుంచి భారత్, రష్యా మధ్య స్నేహం ఉందని పుతిన్ తెలిపారు. భారత్‌తో తమకెప్పుడూ సమస్యలు ఏర్పడలేదని, టెన్షన్లు లేవన్నారు. నరేంద్ర మోదీ తన స్నేహితుడన్నారు. మోదీతో మాట్లాడేటపుడు తనకు ఎంతో సౌకర్యంగా అనిపిస్తుందని చెప్పారు.