IND vs SA: కేప్ టౌన్ టెస్టులో భారత్ విజయ ఢంకా..7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై చారిత్రాత్మక విజయం

IND vs SA: కేప్ టౌన్ టెస్టులో భారత్ విజయ ఢంకా..7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై చారిత్రాత్మక విజయం

మొదటి టెస్టులో ఘోర పరాజయం.. ఇంకేముంది భారత్ పనైపోయిందనుకున్నారు. సఫారీల గడ్డపై ప్రతిసారి చేతులెత్తేసే భారత్ ఈ సారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగిస్తారని విమర్శలు గుప్పించారు. అయితే కొత్త సంవత్సరంలో టీమిండియా విశ్వ రూపమే చూపిస్తుంది. సఫారీల సొంతగడ్డపై చెలరేగి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. పటిష్టమైన సౌత్ ఆఫ్రికాను పసికూనగా మారుస్తూ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి దక్షిణాఫ్రికా టూర్ ను ఘనంగా ముగించారు. 

 79 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుస బౌండరీలతో హోరెత్తించాడు. 23 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్(10), కోహ్లీ(12) త్వరగా ఔటైనా రోహిత్ (17),అయ్యర్(4) మ్యాచ్ ను ఫినిష్ చేశారు. రబడా, జాన్సెన్, బర్గర్ కు తలో వికెట్ లభించింది. ఈ మ్యాచ్ భారత్ గెలవడంతో టెస్టు సిరీస్ 1-1 తో డ్రా అయింది.      

3 వికెట్లకు  62 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా భారత పేసర్  బుమ్రా ధాటికి విలవిల్లాడింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో సఫారీలు కేవలం 176 పరుగులకే ఆలౌటయ్యారు. మార్కరం 106 పరుగులతో ఒంటరి పోరాటం చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. 

భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లు తీసుకోగా.. ముఖేష్ 2 వికెట్లు, సిరాజ్, ప్రసిద్ కృష్ణకు చెరో వికెట్  లభించింది. తొలి ఇన్గ్స్ లో దక్షిణాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 153 పరుగులు చేసింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 98 పరుగుల విలువైన ఆధిక్యం లభించింది.