
- 2024–25లో రూ.1.20 లక్షల కోట్ల విలువైన వస్తువుల ఎక్స్‌పోర్ట్
- ఫోన్లు కూడా కలుపుకుంటే రూ.3.30 లక్షల కోట్లకు పెరిగిన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
- తమిళనాడు, కర్నాటక, ఉత్తర ప్రదేశ్ నుంచే ఎక్కువ
న్యూఢిల్లీ: ఇండియా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు కిందటేడాది భారీగా పెరిగాయి. కేవలం స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాదు ఇన్వర్టర్లు, చార్జర్లు, బ్యాటరీలు వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులు కూడా ఊపందుకున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఎస్‌సీ) వెల్లడించింది. దీని రిపోర్ట్ ప్రకారం.. 2024–25లో నాన్- స్మార్ట్‌ఫోన్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 14 బిలియన్ డాలర్ల (రూ.1.20 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. స్మార్ట్‌ఫోన్లు కూడా కలుపుకుంటే మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 38.57 బిలియన్ డాలర్ల (రూ.3.30 లక్షల కోట్ల) కు పెరిగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 32.47 శాతం పెరుగుదల. దేశ ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోర్ట్స్‌లో స్మార్ట్‌ఫోన్లు కీలకంగా ఉన్నాయి. అయినప్పటికీ నాన్ -స్మార్ట్‌ఫోన్ విభాగాలు కూడా వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
సోలార్ ప్యానెల్స్, టెలికాం పరికరాలు, మెడికల్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, డిజిటల్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి కీలక ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌ను ఇండియా ఎగుమతి చేస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో ఫోటోవోల్టాయిక్ సెల్స్ విలువ 1.12 బిలియన్ డాలర్లుగా ఉంది. టెలికాం పరికరాలు (1.4 బిలియన్ డాలర్లు) , రెక్టిఫయర్లు, ఇన్వర్టర్లు, చార్జర్లను ( మొత్తం కలిపి 2.5 బిలియన్ డాలర్లు) కూడా ఎక్కువగా ఎగుమతి చేశాం. మెడికల్ ఎలక్ట్రానిక్స్ (400 మిలియన్ డాలర్లు) , పీసీలు, డిజిటల్ యూనిట్ల ( 810 మిలియన్ డాలర్లు) ఎక్స్‌పోర్ట్స్ కూడా ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఇండియా వస్తువుల ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్ వాటా 9 శాతానికి చేరుకుంది. కిందటేడాది నమోదైన 6.73 శాతంతో పోలిస్తే బాగా పెరిగింది. ప్రస్తుతం కీలక దశలో ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్ ఉందని, భారత టెక్ రంగం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోందని ఈఎస్‌సీ పేర్కొంది.
చిప్స్తో మరింత ఊపు
రాష్ట్ర స్థాయిలో ఎగుమతులు కూడా బలంగా ఉన్నాయి. తమిళనాడు 2024–25 లో 14.65 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ (స్మార్ట్‌ఫోన్లతో కలిపి) ఎగుమతి చేసి, మొదటిస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో కర్ణాటక ( 7.8 బిలియన్ డాలర్లు), ఉత్తర ప్రదేశ్ (5.26 బిలియన్ డాలర్లు), మహారాష్ట్ర (3.5 బిలియన్ డాలర్లు), గుజరాత్ (1.85 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. ఈఎస్‌సీ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ వినోద్ శర్మ మాట్లాడుతూ, “భారతదేశం సెమీకండక్టర్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశ టెక్నాలజీ లక్ష్యాలను చేరుకోవడంలో ఇది కీలకం” అని అన్నారు.
తాజాగా ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లలో రూ.4,600 కోట్ల విలువైన నాలుగు కొత్త చిప్ యూనిట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గుజరాత్‌లో మైక్రాన్ రూ.22,516 కోట్ల ఏటీఎంపీ ప్లాంట్, ధొలేరాలో టాటా రూ.91,000 కోట్ల ఫ్యాబ్ ప్రాజెక్ట్ రెడీ అవుతున్నాయి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ (ఈసీఎంఎస్) ప్రారంభాన్ని కూడా ఈఎస్‌సీ హైలైట్ చేసింది. ఈ స్కీమ్‌తో సప్లయ్ చెయిన్ మెరుగుపడుతుందని తెలిపింది. “తాజా గ్రోత్ కేవలం తాత్కాలికం కాదు. ఇది నిర్మాణాత్మక మార్పు” అని ఈఎస్‌సీ పేర్కొంది. ఇలానే కొనసాగితే, 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ ఎగుమతి లక్ష్యాన్ని భారత్ చేరగలదని తెలిపింది.