
న్యూఢిల్లీ: పాకిస్తాన్ డిప్లొమాట్‌ను మన దేశం బహిష్కరించింది. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో పని చేస్తున్న అధికారిపై బహిష్కరణ వేటు వేసింది. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ‘‘న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో పని చేస్తున్న అధికారిని బహిష్కరించాలని నిర్ణయించాం. ఆయన తన హోదాకు తగ్గట్టు ప్రవర్తించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.
24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆ అధికారిని ఆదేశించాం” అని అందులో పేర్కొంది. ఆ అధికారి పేరు మాత్రం వెల్లడించలేదు. అతణ్ని ‘పర్సోనా నాన్ గ్రాటా(ఆమోదయోగ్యం కాని వ్యక్తి)’ కింద పేర్కొంది. ఫారిన్ డిప్లొమాట్ తాము ఉంటున్న దేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే .. ఆ కారణంతో వారిని బహిష్కరించే అధికారం ఆతిథ్య దేశానికి ఉంటుంది. కాగా, భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.