నేడు బంగ్లాదేశ్‌‌తో ఇండియా తొలి టెస్ట్‌‌

నేడు బంగ్లాదేశ్‌‌తో ఇండియా తొలి టెస్ట్‌‌
  • కోహ్లీ, పుజారాపై అధిక భారం
  • ఉ. 9 నుంచి సోనీ నెట్‌‌వర్క్‌‌లో

చట్టోగ్రామ్‌‌: బంగ్లాదేశ్‌‌తో వన్డే సిరీస్‌‌ను చేజార్చుకున్న ఇండియా.. ఇప్పుడు టెస్ట్‌‌ సిరీస్‌‌కు రెడీ అయ్యింది. రెండు టెస్ట్‌‌ల్లో భాగంగా బుధవారం నుంచి ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్‌‌ జరగనుంది. ఓవైపు సీనియర్లకు గాయాలు.. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌‌కు క్వాలిఫికేషన్‌‌ నేపథ్యంలో టీమిండియాకు ఈ సిరీస్‌‌ కీలకంకానుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో ఇండియా నాలుగో ప్లేస్‌‌లో ఉంది. జూన్‌‌లో జరిగే ఫైనల్స్‌‌కు అర్హత సాధించాలంటే ఈ రెండు టెస్ట్‌‌లు నెగ్గడంతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్‌‌ల్లోనూ గెలవాల్సిందే. మరి ఇది సాధ్యం కావాలంటే ఈ మ్యాచ్‌‌తోనే ఇండియా ప్లేయర్లు జూలు విదిలించాల్సిందే. 

కుర్రాళ్లపైనే భారం.. 

ప్రస్తుతం టీమిండియాను గాయాల బెడద పీడిస్తోంది. రెగ్యులర్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మతో పాటు స్టార్‌‌ పేసర్లు బుమ్రా, షమీ, స్పిన్నర్‌‌ రవీంద్ర జడేజా లేకపోవడం జట్టు కూర్పును బాగా దెబ్బతీస్తోంది. దీంతో కెప్టెన్‌‌గా రాహుల్‌‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. సెకండ్‌‌ ఓపెనర్‌‌గా శుభ్‌‌మన్‌‌ గిల్‌‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. టాప్‌‌ ఆర్డర్‌‌లో కోహ్లీ, పుజారాతో పాటు మిడిల్‌‌లో శ్రేయస్‌‌ అయ్యర్‌‌, రిషబ్‌‌ పంత్‌‌ మెరిస్తేనే భారీ స్కోరు ఖాయం. 2015లో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌‌ను డ్రా చేసుకున్న ఇండియా ఇప్పటివరకు వాళ్ల చేతిలో టెస్ట్‌‌ మ్యాచ్‌‌ ఓడలేదు. ఉపఖండం పిచ్‌‌లపై అశ్విన్‌‌–జడేజా బాగా హిట్టయ్యారు. కానీ ఇప్పుడు జడేజా ప్లేస్‌‌లో వచ్చిన అక్షర్‌‌ పటేల్‌‌, కుల్దీప్‌‌ యాదవ్‌‌ ఎంత మేరకు ప్రభావం చూపుతారో చూడాలి. సీనియర్‌‌ పేసర్లు లేకపోవడంతో ఉమేశ్‌‌ యాదవ్‌‌, మహ్మద్‌‌ సిరాజ్‌‌పై ఒత్తిడి నెలకొంది. బ్యాటింగ్‌‌ పిచ్‌‌ కావడంతో ఇద్దరు పేసర్లతో పాటు ఇద్దరు స్పిన్నర్లు తుది జట్టులో ఉండనున్నారు. ఒకవేళ థర్డ్‌‌ పేసర్‌‌ కావాల్సి వస్తే నవ్‌‌దీప్‌‌ సైనీ, జైదేవ్‌‌ ఉనాద్కట్‌‌లో ఒకరికి చాన్స్‌‌ దక్కుతుంది. 

గెలుపే లక్ష్యంగా..

వన్డే సిరీస్‌‌ నెగ్గి జోష్‌‌ మీదున్న బంగ్లాదేశ్‌‌.. టెస్ట్‌‌ల్లోనూ సత్తా చాటాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. ఇందుకోసం బలమైన టీమ్‌‌ను బరిలోకి దించుతున్నది. అలాగే గత 22 ఏళ్లుగా టీమిండియాపై టెస్ట్‌‌ మ్యాచ్‌‌ గెలవని చరిత్రను కూడా మార్చుకోవాలని చూస్తోంది. అయితే బ్యాటింగ్‌‌లో బలంగా కనిపించే బంగ్లా బౌలింగ్‌‌లో కాస్త బలహీనంగా ఉంది. స్వదేశంలో ఆడుతున్నప్పుడు టస్కిన్‌‌ అహ్మద్‌‌ లేకపోవడం లోటు. ఎబాదత్‌‌ హుస్సేన్‌‌, షోరిఫుల్‌‌ ఇస్లామ్‌‌తో కాస్త ప్రమాదం ఎదురయ్యే అవకాశాలున్నాయి. బ్యాటింగ్‌‌లో షకీబ్‌‌, లిటన్‌‌ దాస్‌‌, ముష్ఫికర్‌‌ రహీమ్‌‌ నిలకడగా ఆడుతుండటం కలిసొచ్చే అంశం.