దేశంలో పెరిగిన పెట్రో ప్రొడక్టుల వాడకం

దేశంలో  పెరిగిన పెట్రో ప్రొడక్టుల వాడకం

న్యూఢిల్లీ:  డీజిల్, పెట్రోల్, ఎల్‌‌‌‌పీజీ,  బిటుమెన్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం గత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం పెరిగి రికార్డు స్థాయి 233.276 మిలియన్ టన్నులకు చేరుకుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022–-2023లో పెట్రోలియం వస్తువుల వినియోగం 223.021 మిలియన్ టన్నులుగా ఉంది. ట్రక్కులు, బస్సులు,  వ్యవసాయ రంగం ఉపయోగించే డీజిల్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2023-–24లో 4.4 శాతం పెరిగాయి. 

ఇది దేశంలో ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఏడాది కాలంలో కార్లు, టూవీలర్ల అమ్మకాలు పెరగడంతో పెట్రోల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ 6.4 శాతం పెరిగింది. ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని పెంపొందించేందుకు ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టడంతో, రోడ్ల తయారీకి ఉపయోగించే బిటుమెన్ విక్రయాలు ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతం పెరిగాయి. ఎరువుల తయారీకి ఉపయోగించే నాఫ్తా అమ్మకాలు కూడా వార్షికంగా భారీగా పెరిగాయి.