ఇండియాకు షాక్​

ఇండియాకు షాక్​

క్రాస్​ ఓవర్​ మ్యాచ్​లో అనూహ్య ఓటమి
సడెన్​ డెత్​లో గెలిచిన న్యూజిలాండ్​ 
క్వార్టర్​ఫైనల్లోకి ప్రవేశం

భువనేశ్వర్ : సొంతగడ్డపై హాకీ వరల్డ్​కప్​లో ఇండియాకు షాక్​ తగిలింది. క్వార్టర్స్​ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన క్రాస్​ ఓవర్​ మ్యాచ్​లో ఓ దశలో 2-–0తో ఆధిక్యంలో నిలిచిన హోమ్‌టీమ్‌  చేజేతులా ఓడిపోయింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో  న్యూజిలాండ్​ ‘సడెన్​ డెత్​’లో ఇండియాపై విజయం సాధించి క్వార్టర్స్​కు చేరుకుంది. ఫలితంగా 48 ఏళ్ల తర్వాత వరల్డ్​కప్ ​ గెలవాలన్న టీమిండియాకు చుక్కెదురైంది. రెగ్యులర్​ టైమ్​ను ఇరుజట్లు 3–3 స్కోరుతో ముగించాయి. ఇండియా తరఫున లలిత్​ కుమార్​ ఉపాధ్యాయ్​ (17వ ని.), సుఖ్​జిత్​ సింగ్​ (24వ ని.), వరుణ్​ కుమార్​ (40వ ని.) గోల్స్​ చేయగా, లాన్​ సామ్​ (28వ ని.), కేన్​ రస్సెల్​ (43వ ని.), ఫిండ్లే సీన్​ (49వ ని.) కివీస్​కు గోల్స్​ అందించారు. ​తొలి హాఫ్​ ముగిసే సమయానికి ఇండియా 2–0 లీడ్​లో ఉన్నా.. ఆ తర్వాత డిఫెన్స్​ ఫెయిల్యూర్​తో కివీస్​కు పుంజుకునే చాన్స్​ ఇచ్చింది. మ్యాచ్​ మొత్తంలో ఇండియాకు 11 పెనాల్టీలు లభించగా, రెండింటిని మాత్రమే గోల్స్​గా మలిచింది. కివీస్​కు రెండు చాన్స్​లు మాత్రమే వచ్చాయి. చాలాసార్లు గోల్ కొట్టే చాన్స్​ వచ్చినా.. ఇండియా​ ఫార్వర్డ్స్​ సరైన ఫినిషింగ్​ను చూపలేకపోయారు. సెకండ్​ హాఫ్​లో గొప్పగా పుంజుకున్న కివీస్​.. వచ్చిన చాన్స్​లను అద్భుతంగా ఉపయోగించుకుంది. వరుస విరామాల్లో గోల్స్​ కొట్టి స్కోరు సమం చేయడంతో షూటౌట్​ అనివార్యమైంది. 

శ్రీజేష్​కు గాయం.. ఇండియాకు దెబ్బ

ఐదు సెట్ల పెనాల్టీ షూటౌట్​లో 2–3తో వెనుకబడిన ఇండియాను గోల్​ కీపర్​ పీఆర్​ శ్రీజేష్​ ఆదుకున్నాడు. న్యూజిలాండ్​ చివరి రెండు ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకోవడంతో పాటు సడెన్​ డెత్​లోనూ ఓ గోల్​ను ఆపి ఇండియాను ఆదుకున్నాడు.  షూటౌట్​లో ఇండియా తరఫున హర్మన్​ప్రీత్​, రాజ్​కుమార్​, సుఖ్​జిత్​ గోల్స్​ చేయగా, షంషేర్​, అభిషేక్​ ఫెయిలయ్యారు. కివీస్​ ప్లేయర్లలో నిక్​ వుడ్స్​, ఫిండ్లే సీన్​, ఫిలిప్స్​ హైడెన్స్​ గోల్​ చేయగా, సామ్​ హిహా, సామ్​ లేన్​ ప్రయత్నాలను శ్రీజేష్​ నిలువరించాడు. ఇక సడెన్​ డెత్ తొలి రౌండ్​​లో కివీస్​ ప్లేయర్​ నిక్​ వుడ్స్​ కొట్టిన ప్రయత్నాన్ని శ్రీజేష్​ అడ్డుకున్నాడు. ఈ టైమ్​లో హర్మన్​ గోల్​ కొడితే ఇండియా గెలిచేది. కానీ అతను కొట్టిన బాల్​ను కివీస్​ కీపర్​ నిలువరించాడు. ఇదే టైమ్​లో శ్రీజేష్​ మోకాలి గాయంతో బయటకు వెళ్లడం ఇండియాను దెబ్బతీసింది. అతని ప్లేస్​లో వచ్చిన కృషన్​ పాథక్​ ఫెయిలయ్యాడు. రెండో రౌండ్​లో సుఖ్​జిత్​, హైడెన్​ విఫలం కాగా, థర్డ్​ రౌండ్​లో షంషేర్​ టార్గెట్​ను మిస్సయ్యాడు. కానీ సామ్​ లేన్​ సక్సెస్​ అవడంతో  కివీస్​ విజయం ఖాయమైంది. మరో మ్యాచ్​లో స్పెయిన్​ 4–3 (పెనాల్టీ షూటౌట్​)తో మలేసియాను ఓడించి క్వార్టర్స్​లోకి ప్రవేశించింది. రెగ్యులర్​ టైమ్​లో ఇరుజట్లు 2–2 స్కోరు చేయడంతో షూటౌట్​ను నిర్వహించారు.