
న్యూఢిల్లీ: పాకిస్తాన్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసివేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో తమ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై పాకిస్తాన్ నిషేధం విధించింది. దానికి ప్రతిచర్యగా వారం రోజులకు భారత్ కూడా దీటుగా స్పందించింది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసింది. మే 23 వరకు నో -ఫ్లై జోన్ చర్య కొనసాగనుందని కేంద్రం తెలిపింది. ఇందుకు సంబంధించి నోటమ్ బుధవారం జారీ చేసింది. మన దేశం తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి.
పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేసియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయ్ లాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే. కానీ ఇప్పుడు చైనా లేదా శ్రీలంక వంటి దేశాల మీదుగా పొడవైన మార్గాల్లో విమానాలు పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉంటుంది. ఇరాన్, అఫ్గానిస్తాన్, లేదా సెంట్రల్ ఆసియా దేశాల మీదుగా రీరూట్ చేయాల్సి ఉంటుంది. ఇది పాకిస్తాన్ కు జియోపొలిటికల్, లాజిస్టికల్ సవాళ్లను తెచ్చిపెడుతుంది.