గణతంత్ర వేడుకలకు చీఫ్‌ గెస్ట్‌గా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

గణతంత్ర వేడుకలకు చీఫ్‌ గెస్ట్‌గా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. మొదట ఈ వేడుకలకు ఆమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.  కానీ ఆయన అందుకు విముఖత వ్యక్తం చేశారు.  దీంతో కేంద్ర ప్రభుత్వం ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ను ఆహ్వానించింది. దీంతో భారత్ లో రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఆరో  ఫ్రెంచ్ నాయకుడు మాక్రాన్ కావడం విశేషం. 

కాగా ఈ ఏడాది జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఈ సమయంలో పారిస్‌లో జరిగిన బాస్టిల్ డే (ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం) వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొన్నారు. దీని తర్వాత సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ, మాక్రాన్‌లు ఇరుదేశాల అభివృద్ధి, సంబంధాలపై చర్చించారు.2023 రిపబ్లిక్ డే పరేడ్‌కు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్‌ తన మిత్ర దేశాల నేతలను ఆహ్వానించడం 1950 నుంచి సంప్రదాయంగా వస్తోన్న విషయం తెలిసిందే. కానీ 2021, 2022 గణతంత్ర దినోత్సవ వేడుకలకు కరోనా కారణంగా ఎవరినీ ఆహ్వానించలేదు.