
లండన్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను బ్రిటన్ మాజీ ప్రధాని, భారత సంతతి వ్యక్తి రిషి సునక్ సమర్థించారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ దాడులు చేయడం సమర్థనీయమే అంటూ భారత్‌కు అండగా నిలిచారు. అమాయక ప్రజల ప్రాణాలు తీస్తోన్న ఉగ్రవాదులకు శిక్ష నుంచి మినహాయింపు ఉండదని అన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆపరేషన్ సిందూర్‌పై ఆయన స్పందించారు. ‘‘ఏ దేశం కూడా మరొక దేశ నియంత్రణలో ఉన్న భూమి నుంచి తమపై ఉగ్రవాద దాడులను అంగీకరించాల్సిన అవసరం లేదు. భారతదేశం ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేయడం సమర్థనీయం. ఉగ్రవాదులకు శిక్షార్హత ఉండదు’’ అని రిషి పేర్కొన్నారు.
అంతకుముందు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆపరేషన్ సిందూర్‌పై రియాక్ట్ అయ్యారు. రెండు దేశాల్లోని తన సహచరులను సంయమనం పాటించాలని కోరుతున్నానని అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు బ్రిటన్ అంతటా చాలా మందికి తీవ్ర ఆందోళన కలిగిస్తాయన్నారు. రెండు దేశాలతో పాటు ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో అత్యవసరంగా చర్చలు జరుపుతున్నామని.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి పౌరుల రక్షణను కోసం ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
►ALSO READ | భారత్‌కు యుద్ధం చేసే ఆలోచన లేదు.. కానీ పాక్ రెచ్చగొడితే తొక్కిపడేస్తాం: అజిత్ దోవల్
కాగా, 2025, ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. 26 మంది టూరిస్టులను విచక్షణరహితంగా కాల్చి చంపారు. ఈ దాడికి ప్రతీకారంగా 2025, మే 7 బుధవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)తో పాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపింది. ఈ దాడుల్లో వివిధ టెర్రరిస్టు గ్రూపులకు చెందిన దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. దీంతో ఇరుదేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ప్రపంచదేశాల భారత్, పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.