30 సెకన్లలోనే రిపోర్ట్ వచ్చేలా కరోనా ర్యాపిట్ టెస్టు కిట్!

30 సెకన్లలోనే రిపోర్ట్ వచ్చేలా కరోనా ర్యాపిట్ టెస్టు కిట్!

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో టెస్టులే కీలకం. వైరస్ బారినపడిన వారిని వేగంగా గుర్తిస్తే మరింత మందికి అంటుకోకుండా అడ్డుకోవచ్చు. కరోనా వైరస్ నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ టెస్టులనే ప్రామాణికంగా చెబుతున్నారు. అయితే ఈ టెస్టు రిజల్ట్ రావడానికి ఆరు గంటల వరకు పడుతుంది. అయితే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి పెరగడంతో టెస్టుల కోసం క్యూలో ఉంటున్న శాంపిల్స్ సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో టెస్టుకు శాంపిల్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి రిపోర్ట్ రావడానికి మూడు రోజుల వరకు టైమ్ పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా ఐదు రోజులకు గానీ రిజల్ట్ చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పటికే వేగంగా ఫలితాలు వచ్చే ర్యాపిట్ కిట్లతో టెస్టులకు అనుమతి ఇచ్చింది కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ర్యాపిడ్ కిట్లతో చేస్తున్న టెస్టు రిజల్ట్ రావడడానికి 15 నిమిషాల నుంచి అర గంట వరకు పడుతోంది. అయితే ఈ సమయాన్ని భారీగా తగ్గించి, కేవలం అర నిమిషంలోనే కరోనా ఉందో లేదో తేల్చేసే ర్యాపిడ్ టెస్ట్ కిట్లను రూపొందించేందుకు భారత్, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిశోధనలకు సిద్ధమయ్యారు. ఈ రీసెర్చ్ భారత్‌లోనే చేసేందుకు ఇజ్రాయెల్‌ నుంచి కొద్ది రోజుల్లోనే డిఫెన్స్, హెల్త్ విభాగాల సైంటిస్టులు రాబోతున్నారు. భారత్‌లో డీఆర్డీవోతో కలిసి పరిశోధనలు చేయనున్నారు.

ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ స్పెషల్ ఫ్లైట్‌లో న్యూఢిల్లీకి రానున్నట్లు ఇజ్రాయెల్ రాయబారి రాన్ మల్కా గురువారం వెల్లడించారు. ఈ శాస్త్రవేత్తల బృందాన్ని భారత టాప్ సైంటిస్ట్ కే విజయ్ రాఘవన్ లీడ్ చేస్తారని చెప్పారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలతో కలిసి ఇజ్రాయెల్ సైంటిస్టులు పరిశోధలను చేస్తారన్నారు. మునుపెన్నడూ లేనంతగా భారత్‌కు ఈ క్లిష్ట సమయంలో సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు రాన్. ప్రపంచం మొత్తానికి తక్కువ కాస్ట్‌లో ఉత్తమ పరిష్కారాన్ని రెండు దేశాలు కలిసి అందుబాటులోకి తెస్తాయని అన్నారు. అలాగే ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్ట్రీ, ప్రైవేటు సంస్థలు కలిసి భారత్‌కు డొనేట్ చేసిన వెంటిలేటర్లను మరికొంది రోజుల్లో స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకుని రానున్నట్లు తెెలిపారు. భారత్‌కు వీటిని అందించేందుకు వెంటిలేటర్ల ఎగుమతికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇచ్చిందన్నారు.

కరోనా మొదలైన సమయంలో భారత్‌ తమ దేశానికి మాస్కులు, మెడిసిన్స్ సహా ప్రొటెక్టివ్ ఎక్యూప్మెంట్ భారీగా అందజేసిందని రాన్ పేర్కొన్నారు. కరోనా క్రైసిస్ సమయంలో పరస్పర సహకారం అందించుకోవడంలో భాగంగా భారత ప్రధాని మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మూడు సార్లు ఫోన్‌లో మాట్లాడారని, కరోనాకు చెక్ పెట్టేందుకు సైంటిఫిక్ రీసెర్చ్ పరంగా రెండు దేశాలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారని చెప్పారు.