
చెన్నై వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 49.1 ఓవర్లలో 248 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ని ఆసీస్ 1-2తో కైవసం చేసుకుంది.
భారత్ బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ (54, 72 బంతుల్లో) హాఫ్ సెంచరీ బాదగా.. హార్దిక్ పాండ్య (40, 40 బంతుల్లో) మెరిసాడు. అయితే, ఏ బ్యాట్స్ మెన్ పార్ట్ నర్షిప్ ని నిలుపుకొని ఇన్నింగ్స్ చక్కబెట్టే ప్రయత్నం చేయలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (30, 17 బంతుల్లో) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. టాప్ ఆర్డర్ శుభ్‌మన్ గిల్ (37), కేఎల్ రాహుల్ (32) ఫర్వాలేదనిపించారు. సూర్యకుమార్ యాదవ్ (0) గోల్డెన్ డక్ అయి మరోసారి నిరాశ పరిచాడు. అక్షర్ పటేల్ (2) కూడా ఆకట్టుకోలేకపోయాడు. జడేజా (18), షమి (14) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా.. అగర్ రెండు, సీన్ అబాట్, స్టాయినిస్ చెరో వికెట్ తీసుకున్నారు.