V6 News

ఇండియా–న్యూజిలాండ్‌‌ ఎఫ్‌‌టీఏ ఖరారు

ఇండియా–న్యూజిలాండ్‌‌ ఎఫ్‌‌టీఏ ఖరారు

న్యూఢిల్లీ: ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌‌ (ఎఫ్‌‌టీఏ) పై ఇండియా, న్యూజిలాండ్‌‌ సోమవారం సంతకాలు చేయనున్నాయి. గతేడాది  డిసెంబర్‌‌ 22న చర్చలు ముగిశాయి.  ఈ ఎఫ్‌‌టీఏ ప్రకారం,    భారత కంపెనీలపై న్యూజిలాండ్‌‌లో టారిఫ్‌‌లు పడవు. అలాగే వచ్చే 15 ఏళ్లలో తయారీ, మౌలిక వసతులు, సేవలు వంటి  రంగాల్లో  20 బిలియన్‌‌  డాలర్ల (రూ.1.88 లక్షల కోట్ల) పెట్టుబడులు భారత్‌‌లోకి వచ్చే అవకాశం ఉంది.

ఢిల్లీ భారత్‌‌ మండపంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌‌ గోయల్‌‌, న్యూజిలాండ్‌‌ వాణిజ్య–పెట్టుబడి మంత్రి టాడ్‌‌ మెక్‌‌క్లే సమక్షంలో ఎఫ్‌‌టీఏపై సంతకాలు జరగనున్నాయి.  ఫార్మాస్యూటికల్స్‌‌, వైద్య పరికరాలకు సులభమైన ప్రవేశం, నిపుణులకు తాత్కాలిక ఉద్యోగ వీసాలు, ఐటీ, ఇంజనీరింగ్‌‌, ఆరోగ్య, విద్య, నిర్మాణ రంగాల్లో వర్కర్ల తరలింపు పెరగడం వంటి ప్రయోజనాలు ఇండియాకు లభిస్తాయి.

న్యూజిలాండ్‌‌ నుంచి ఇండియాకు ఎగుమతి అయ్యే  వూల్‌‌, బొగ్గు, చెక్క, వైన్‌‌, అవకాడో, బ్లూబెర్రీల వంటి 95శాతం ప్రొడక్ట్‌‌లపై సుంకాలు తగ్గుతాయి. అయితే భారత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు  పాల ఉత్పత్తులు, ఉల్లిపాయలు, చక్కెర, మసాలాలు, నూనెలు, రబ్బరు వంటి ఉత్పత్తులపై ఎలాంటి టారిఫ్‌‌ రాయితీలు ఇవ్వలేదు. 

న్యూజిలాండ్‌‌ నుంచి వచ్చే  కివీ, యాపిల్‌‌పై  కోటా ఆధారంగా టారిఫ్‌‌లు తగ్గుతాయి.  ఈ ఒప్పందం ద్వారా ఐదు సంవత్సరాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుత 2.4 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్‌‌ డాలర్లకు చేరే అవకాశం ఉంది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరక యూఏఈ, ఆస్ట్రేలియా, యూకే, ఈఎఫ్‌‌టీఏ దేశాలు, ఒమాన్‌‌, యూరోపియన్ యూనియన్‌‌, మారిషస్‌‌తో ఎఫ్‌‌టీఏ ఒప్పందాలను కుదుర్చుకుంది.