
- ఇండియా ఏమైనా ధర్మసత్రమా?
- శరణార్థులు అందరికీ ఆశ్రయం ఇవ్వాలా?: సుప్రీంకోర్టు
- ఇప్పటికే 140 కోట్ల మందితో సతమతమవుతున్నామని కామెంట్
- దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీలంకవాసి పిటిషన్
- ఇక్కడ ఉండేందుకు మీకేం హక్కు ఉందన్న కోర్టు
- స్వదేశంలో ప్రాణహాని ఉంటే వేరే దేశానికి వెళ్లాలని సూచన
న్యూఢిల్లీ: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు ఇండియా ఏమీ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో ఆశ్రయం కోరుతూ శ్రీలంక జాతీయుడు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ సెటిల్ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. శ్రీలంకలో నిషేధిత టెర్రరిస్ట్ఆర్గనైజేషన్ అయిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 2015లో శ్రీలంకకు చెందిన తమిళ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది. 2018లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అతడికి 10 ఏండ్ల జైలు శిక్ష పడింది. దీంతో అతడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా, శిక్షను ఏడేండ్లకు తగ్గించింది. కానీ, శిక్ష పూర్తైన తర్వాత దేశం విడిచిపోవాలని కోర్టు ఆదేశించింది. అంతకుముందు శరణార్థి శిబిరంలో ఉండాలని సూచించింది.
దేశంలోనే ఆశ్రయం కల్పించాలని కోర్టుకు..
శిక్ష పూర్తైన తర్వాత తాను శ్రీలంకకు వెళ్లబోనని, భారత్లోనే ఆశ్రయం కల్పించాలని కోరుతూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను చట్టబద్ధమైన వీసాపైనే భారత్‌కు వచ్చానని, స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పిటిషన్లో పేర్కొన్నాడు. తన భార్యాపిల్లలు ఇండియాలోనే సెటిల్ అయ్యారని, అందువల్ల తనకు కూడా ఇక్కడే ఆశ్రయం కల్పించాలని అభ్యర్థించాడు. దాదాపు మూడేండ్లుగా తాను నిర్బంధంలో ఉన్నానని, బహిష్కరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని తెలిపాడు.ఈ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ తో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా అసహనం వ్యక్తం చేసింది. వివిధ దేశాలనుంచి వచ్చే వారందరికీ ఇక్కడ ఆశ్రయం కల్పించేందుకు భారత్ ఉచిత సత్రం నడపడం లేదని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 19, 21 ప్రకారం పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించగా.. పిటిషనర్ నిర్బంధం ఆర్టికల్ 21ని ఉల్లంఘించదని జస్టిస్ దత్తా అన్నారు. అలాగే, ఆర్టికల్19 ఈ దేశ పౌరులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. శ్రీలంకలో అతడి ప్రాణానికి ముప్పు ఉందని లాయర్ తెలపగా.. అయితే వేరే దేశానికి వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది.