భారత రాజ్యాంగాన్ని స్వీకరించినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 26న మన దేశంలో రాజ్యాంగ దినోత్సవం 'సంవిధాన్ దివస్'ను జరుపుకుంటున్నాం. 1949 నవంబర్ 26న రాజ్యాంగసభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది, ఇది 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. 2015లో బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
భా రతదేశ ప్రజలమైన మేము.. అనే ప్రవేశికతో మొదలయ్యే మన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు,
22 భాగాలుగా ఉంది. 12 షెడ్యూళ్లలో 448 ఆర్టికల్స్‌ను కలిగి ఉంది. భారత రాజ్యాంగాన్ని ఇంగ్లిష్ , హిందీ భాషల్లో చేతి రాతతో రాశారు. ప్రేమ్ బిహారీ నారాయణన్ రాయ్ జాదా, ఇటాలిక్ కాలిగ్రఫ్ స్టైల్లో రాశారు.
ప్రతిపేజీని కొందరు కళాకారులు అందంగా తీర్చిదిద్దారు. రాజ్యాంగ మూల ప్రతులను ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ భవనంలోని గ్రంథాలయంలో ఉన్నాయి. వీటిని హీలియం వాయువు నింపిన పెట్టెలో భద్రపరిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో హెచ్ వీ కామత్ పోల్చాడు.
టీ అమ్మిన సాధారణ బాలుడు పెద్దయ్యాక దేశ ప్రధాని పదవిని అధిష్టించినా, ఒక స్త్రీ దేశానికి రాష్ట్రపతి అయిందన్నా, అంటారనితనాన్ని ఎదుర్కొన్న జాతులు చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నాయన్నా దానికి కారణం మన రాజ్యాంగమే.
భారత రాజ్యాంగం ఒక విప్లవాత్మక లిఖిత గ్రంథం. ప్రత్యామ్నాయ భావజాలంతో కూడిన దేశ అభివృద్ధికి సంబంధించిన పత్రం. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పూర్తి సమయాన్ని తన మేధస్సును రాజ్యాంగ రచనకి కేంద్రీకరించారు. మారుతున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటు కల్పించడం విశేషం. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ఆశించినవిధంగా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండడం బాధాకరం.
ప్రమాదంలో దేశ స్వాతంత్ర్యం
బహుళ జాతులు, సంస్కృతులు, మతాలు, కులాలు ఉన్న దేశంలో 'ఒకే దేశం.- ఒకే జాతి' అనే ధోరణిలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రాల హక్కులను కాలరాసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తోంది.
రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు, మైనార్టీ వ్యతిరేక చట్టాలు, పౌరుల హక్కులను కాలరాసే చట్టాలు తెస్తోంది. తన అనుయాయులకి మధ్య భారతదేశంలోని బాక్సైట్ నిక్షేపాలను అందించేందుకు అమాయక గిరిజనులను ఊచకోత కోస్తూ రాజ్యాంగ మూలసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓట్ చోరీకి పాల్పడుతూ ఎన్నికల్లో అక్రమంగా గెలుస్తున్నది. దీనిపై హర్యానా, బెంగళూరు, బిహార్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపెట్టినా.. ఎన్నికల కమిషన్ కనీసం స్పందించకపోవడం విడ్డూరం. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ లాంటి ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అదే జరిగితే దేశం సౌభ్రాతృత్వం కోల్పోయి స్వాతంత్ర్యం ప్రమాదంలో పడుతుంది.
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
'నేను ఎంతో కష్టపడి సాధించిన ఈ హక్కుల గిడారును చేతనైతే ముందుకు తీసుకొని వెళ్ళండి లేదా అక్కడే వదిలివేయండి. అంతేగానీ వెనక్కి మాత్రం లాగవద్దు' అని చెప్పిన బాబా సాహెబ్ మాటలు ప్రతి భారతీయుడు మననం చేసుకోవాలి. బాధ్యతగల పౌరునిగా రాజ్యాంగాన్ని యథాతథంగా అంగీకరించాలి. తదనుగుణంగా వ్యవహరించాలి. భారతదేశం ఉపిరి, గౌరవం, ఉనికి రాజ్యాంగంలో నిక్షిప్తమై దేశ ప్రజల గుండె చప్పుడై ఉంది. రాజ్యాగాన్ని పరిరక్షించుకోవడానికి రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామం నుంచి దేశ రాజధాని వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు నిర్వహించింది.
బడుల్లో రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ రోజూ చేయించాలి
దేశంలో ఉన్న 147 కోట్ల మంది భారతదేశ జనాభాలో 15 ఏళ్లలోపు ఉన్న బాలలు 36 కోట్లు. దేశ జనాభాలో వీరు 25. 4%. భవిష్యత్ భారతావని ముఖచిత్రాన్ని మార్చే మూల స్తంభాలే ఈ చిన్నారులు. కుల, మత భావోద్వేగాలను రాజకీయాలకు వాడుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగ విలువలను నేటి బాలలకు నేర్పించడం అత్యావశ్యకం.
నేటి బాలల్లో చిన్నప్పటి నుంచే సమతాభావం పెంపొందించేందుకు భారత రాజ్యాంగ విలువలు నేర్పించాలి. ఇందుకోసం బాల్యం నుంచే ప్రతిరోజు బడుల్లో ప్రార్థన సమయంలో విధిగా భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేపించాలి. దీనిద్వారా భారత రాజ్యాంగంపై బాల్యం నుంచే బాలలకు గౌరవం, అధ్యయనం చేయాలనే ఆలోచన పెరుగుతుంది.
రేపటి పౌరులను భారతదేశంలోనే అత్యున్నత విలువలు గల వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. బాలల్లో రాజ్యాంగ విలువలు, లక్ష్యాలు, హక్కులు, ఆర్టికల్స్ మీద పూర్తి అవగాహన కల్పించడంవల్ల వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది భవిష్యత్ తరానికి అందించినవారమవుతాం. భారత రాజ్యాంగం అనేది కేవలం చట్టాల సంకలనం కాదు. ఇది దేశ పాలనకు మార్గనిర్దేశం చేసే ఒక సజీవ పత్రం.
రాజ్యాంగ పరిరక్షణ పౌరుల ప్రాథమిక విధి
రాజ్యాంగ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వానికో లేదా న్యాయవ్యవస్థకో చెందిన పని కాదు. ఇది ప్రతి భారతీయ పౌరుడి ప్రాథమిక విధి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో, రాజ్యాంగమే ప్రజాస్వామ్య మనుగడకు మూలం. సమయానుగుణంగా ఎన్నికలు నిర్వహించడం, పాలకులు చట్టబద్ధంగా అధికారాన్ని వినియోగించడం వంటి అంశాలన్నీ రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారమే జరుగుతాయి.
రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులకు (సమానత్వం, స్వేచ్ఛ, దోపిడీ నుంచి రక్షణ, మత స్వాతంత్ర్యం మొదలైనవి) హామీ ఇస్తుంది. ఈ హక్కులు ఉల్లంఘనకు గురైనప్పుడు, న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని రక్షించి, పౌరులకు న్యాయం చేస్తుంది. రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు సామాజిక, ఆర్థిక న్యాయాన్ని సాధించడానికి ప్రభుత్వానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి.
అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు, సమాన అవకాశాలు కల్పించడం వంటి సంస్కరణలన్నింటికీ రాజ్యాంగమే ఆధారం. రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమా నం అనే సూత్రాన్ని నొక్కి చెబుతుంది. అంటే, ధనిక, పేద, అధికారి, సాధారణ పౌరుడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దేశ చట్టాలకు లోబడి ఉండాలి. ఈ సూత్రాన్ని కాపాడటం రాజ్యాంగ పరిరక్షణలో కీలక భాగం.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి
మన రాజ్యాంగం లౌకికవాదాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే, దేశానికి అధికారిక మతం లేదు. పౌరులందరికీ తమకు నచ్చిన మతాన్ని పాటించే స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగాన్ని పరిరక్షించడం అనేది ప్రతి పౌరుడు నిత్య జీవితంలో పాటించాల్సిన కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది.
రాజ్యాంగం పీఠిక, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధుల గురించి తెలుసుకోవడం మొదటి మెట్టు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమిక విధులను నిర్దేశించింది (ఉదాహరణకు, రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను గౌరవించడం, దేశ సమగ్రతను పరిరక్షించడం). వీటిని పాటించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టవచ్చు. ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనడం. ఓటు హక్కును వినియోగించుకోవడం, అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉండటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. రాజ్యాంగం కులం, మతం, ప్రాంతం, లింగభేదం లేని సమానత్వాన్ని నొక్కి చెబుతున్నది.
రాజ్యాంగం మనకొక గొప్ప వరం
రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోంది. న్యాయస్థానాల తీర్పులను గౌరవించడం అవసరం. భారత రాజ్యాంగం మన దేశానికి అందిన ఒక గొప్ప వరం. ఇది డా. బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలకు అద్దం పడుతోంది. ‘రాజ్యాంగం ఎంత ఉన్నతమైనదైనా, దాన్ని అమలు చేసేవారు ఉన్నతులు కాకపోతే అది ఒక చెడ్డ రాజ్యాంగంగానే నిరూపించబడుతుంది’ అని అంబేద్కర్ హెచ్చరించారు.
కాబట్టి, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన రాజ్యాంగం పవిత్రతను, విలువలను అర్థం చేసుకుందాం. దానిని పరిరక్షించడానికి మనమందరం కృషి చేద్దాం. రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలోపెట్టి, మన దేశాన్ని మరింత దృఢమైన, సమతామయమైన గణతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దుదాం.
పొన్నం ప్రభాకర్, రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి
