న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీలో బోణీ చేశాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్య 21–12, 21–15తో ఆయుష్ షెట్టిపై గెలిచాడు. 36 నిమిషాల మ్యాచ్‌లో లక్ష్య అన్ని అంశాల్లో ఆకట్టుకున్నాడు. బలమైన స్మాష్‌లు, ర్యాలీలు, క్రాస్ కోర్టు విన్నర్లతో చెలరేగాడు. దాంతో ఆయుష్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాడు.
మెన్స్ డబుల్స్‌లో హరిహరన్–ఎం.ఆర్ అర్జున్ 21–15, 21–18తో టియో ఈ యి–ఆంగ్ యీ సిన్ (మలేసియా)పై గెలవగా, స్టార్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీకి వాకోవర్ విజయం లభించింది. వీళ్ల ప్రత్యర్థులు చెన్ జీ యి–ప్రెస్లీ స్మిత్ (అమెరికా) మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. విమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్ 21–15, 21–11తో ఓర్నిచా జోంగ్‌సతపోర్న్‌పర్న్–సుకిత్త సువాచై (థాయ్‌లాండ్)పై నెగ్గగా, శ్రుతి మిశ్రా–ప్రియా 11–21, 20–22, 22–24తో లియు లోక్–సంగ్ హియు యాన్ (హాంకాంగ్) చేతిలో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ రావత్–మనీషా 9–21, 10–21తో హిరోకా మిడోరికవా–నమీ మత్సుయమా (జపాన్) చేతిలో ఓడారు.
