పాక్​ ఉగ్ర వ్యూహాలు ధ్వంసం

పాక్​ ఉగ్ర వ్యూహాలు ధ్వంసం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌‌ను శిక్షిస్తానని గట్టి హెచ్చరికను జారీ చేశారు. హెచ్చరించినట్టుగానే మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత పాకిస్తాన్‌‌లోని ఉగ్రవాద స్థావరాలపై 9 చోట్ల భారత సైన్యం దాడిచేసి దాయాది దేశానికి కఠినమైన సమాధానమిచ్చింది. సరిహద్దులో చెదురుమదురు ఘటనలు తప్ప ఇప్పటివరకు పాకిస్తాన్ నుంచి ఎటువంటి ప్రతిదాడి జరగలేదు. 

ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్​ ఆర్మీ సర్జికల్​ స్ట్రైక్స్​ భారతదేశ ప్రజలకు  ఎంతో ఊరటనివ్వడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. నిరంతరం ఉగ్రదాడులను ప్రోత్సహించే పాకిస్తాన్​ 2025  ఏప్రిల్ 22న కాశ్మీర్‌‌లోని  పహల్గాంలో టెర్రరిస్టులను ఉపయోగించుకుని పర్యాటకులను లక్ష్యంగా చేయించి 26 మంది ప్రాణాలను బలిగొనడం తమకే ప్రమాదంగా మారుతుందని ఊహించి ఉండకపోవచ్చు.

పర్యాటకులపై కాల్పులు జరిపి కాశ్మీర్ ఇంకా ఇబ్బందుల్లో ఉందని ప్రపంచానికి చూపించడంతోపాటు  కాశ్మీర్​కు టూరిస్టులు రాకుండా నిలువరించి భయాందోళనలు సృష్టించాలనేది పాకిస్తాన్​ వ్యూహం.  ఉగ్రదాడితో భారత్​ నుంచి కేవలం మాటల యుద్ధం జరుగుతుందని భావించిందే తప్ప, ప్రతీకార దాడి ఉంటుందని ముందుగా అంచనా వేయలేకపోయింది. 

ఆగస్టు 15, 1947న  భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటినుంచి పాకిస్తాన్ భారతదేశాన్ని నీడలా వెంటాడుతోంది.  పాకిస్తాన్ భారతదేశాన్ని ఒక్కరోజు కూడా కుట్రలు, కుతంత్రాలతో వేధించేందుకు ప్రయత్నించకుండా వదిలిపెట్టలేదు. మరోవైపు పాకిస్తాన్ భారతదేశపు  శత్రువులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి భారతదేశంపై నిరంతరం  విద్వేషాన్ని కక్కింది. 

 భారత్​కు ప్రధాన శత్రువైన చైనాతో పాకిస్తాన్​ జతకట్టి  భారతదేశానికి ఎడతెగని  సమస్యలను సృష్టించింది. దీంతో  భారతదేశం  చైనాతోపాటు పాకిస్తాన్​తోనూ యుద్ధాన్ని చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ కాశ్మీర్‌‌ను  తమదేశంలో కలుపుకోవాలని తీవ్రంగా కోరుకుంటోంది.  కానీ, అంతకంటే ఎక్కువగా,  పాకిస్తాన్ భారతదేశాన్ని నాశనం చేసి  విచ్ఛిన్నం చేయాలని భావిస్తోంది.  ఇప్పటికే  భారతదేశం,  పాకిస్తాన్ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి.  

ఉగ్రకుట్రలను వదులుకోలేదు

1980 తర్వాత పాకిస్తాన్ భారత్​తో  నేరుగా సాధారణ యుద్ధాలు చేయడం పనికిరానివిగా నిర్ణయించుకుని వ్యూహాత్మకంగా ఉగ్రదాడులకు ఊతమిచ్చింది. భారతదేశంపై యుద్ధం చేయడానికి ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించడం ప్రారంభించింది. ఈక్రమంలో వందలాది మంది పార్లమెంటు సభ్యులను బందీలుగా తీసుకునే లక్ష్యంతో  పాకిస్తాన్ 2001లో భారత పార్లమెంటుపై దాడి చేయడానికి ఉగ్రవాదులను ఉపయోగించింది. అయితే, ఆ ప్రయత్నం విఫలమైంది.  

2008లో తాజ్ హోటల్‌‌లో ఉన్న ప్రముఖును  బందీలుగా  పట్టుకుని తమ డిమాండ్లను నెరవేర్చాలని భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న పన్నాగంతో   ముంబైలో టెర్రరిస్టులతో దాడి చేయించింది.  కానీ, పాక్​ చేసిన ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. భారత్​పై దాడిలో ఎన్నిసార్లు విఫలమైనా పాకిస్తాన్ తన ఉగ్రవాద కుట్రను  వదులుకోలేదు.  

మోదీ బలమైన నాయకత్వమే పాక్​కు సవాలు

యుద్ధం ఎలా ముగుస్తుందో ఎప్పటికీ ముందస్తు అంచనా వేయలేమని చరిత్ర మనకు బోధిస్తోంది.   రెండో ప్రపంచ యుద్ధంలో  హిట్లర్ నేతృత్వంలోని  జర్మనీ గెలుస్తుందని అందరూ భావించారు.  కానీ, జర్మనీ  అనూహ్యంగా  ఓడిపోయింది. 1989లో శక్తిమంతమైన చైనాను  చిన్నదేశం  వియత్నాం ఓడించింది. ప్రస్తుతం అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉన్న  శక్తిమంతమైన రష్యా  ఉక్రెయిన్‌‌పై గెలవడానికి ఎలా పోరాడుతుందో  మనం చూస్తున్నాం.  ఇవాళ పాకిస్తాన్​కు అంతర్జాతీయ మద్దతు ఏమాత్రం లేకపోవడం దాని ఓటమిని స్పష్టంగా సూచిస్తున్నది. కాగా, గత 10 సంవత్సరాలలో  ప్రపంచంతోపాటు  భారతదేశంలోనూ భారీ మార్పులు జరిగాయి. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలపై ప్రభావం చూపగల బలమైన నాయకుడిగా ఎదిగారు.  మోదీ ప్రపంచ నాయకులందరితో  వ్యక్తిగతంగా సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. అంతేకాకుండా  నరేంద్ర మోదీ 11 సంవత్సరాలు  ప్రధానమంత్రిగా అధికారంలో కొనసాగుతూ  చాలా నేర్చుకున్నారు.  పాకిస్తాన్  ప్రస్తుతం ఎదుర్కొంటున్నది చాలా బలమైన భారతీయ నాయకుడిని,  భారతదేశం కూడా చాలా బలమైన  వ్యవస్థను కలిగి ఉంది.  మోదీది  మన్మోహన్ సింగ్ తరహా కాదని ఆయన అనూహ్యమైన పనులు చేస్తాడని ప్రతి పాకిస్తానీకి తెలుసు. 

ఆర్థిక ఇబ్బందుల్లో  చైనా 

1962  నుంచి పాకిస్తాన్‌‌కు ప్రధాన మద్దతుదారు చైనా.  కానీ, ప్రస్తుతం  చైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.  ఇప్పుడు చైనా అమెరికాతో శత్రుత్వాన్ని ఎదుర్కొంటోంది. అంతేకాకుండా,  భారతదేశంతో పాటు చైనా చాలామంది  శత్రువులను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌‌ను భారత్​పై ​యుద్ధానికి ప్రోత్సహించడానికి ఇది సరైన సమయం కాదని బహుశా నిర్ణయించుకుని ఉంటుంది.  

ఆఫ్గానిస్తాన్ పట్ల  ఆసక్తి ఉన్నంతకాలం అమెరికా,  యూరోపియన్ దేశాలకు పాకిస్తాన్ అవసరం ఉండేది. కానీ, 2021లో అమెరికా  అఫ్గానిస్తాన్‌‌ను విడిచిపెట్టింది.  దీంతో  2021 నుంచి  పాకిస్తాన్  వల్ల  అమెరికాకి ఎటువంటి  ప్రయోజనం లేకుండాపోయింది. ఆ తర్వాత మొదటిసారిగా పాకిస్తాన్‌‌కు  అమెరికా రక్షణ లేదు.  అమెరికా  అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్  ఉగ్రవాదాన్ని  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  ట్రంప్‌‌కు  ముందు, అమెరికన్ అధ్యక్షులు పాకిస్తాన్ ఉగ్రచర్యలను  సహించారు. 

కానీ,  ట్రంప్ పాకిస్తాన్‌‌ ఉగ్రవాద చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నరేంద్ర మోదీ కూడా అన్ని ముస్లిం దేశాలతో సఖ్యతను  పెంపొందించారు.  ఇకపై  మొత్తం ముస్లిం దేశాలన్నీ పాకిస్తాన్  ఉగ్రవాద  కార్యకలాపాలకు  ఎల్లకాలం మద్దతు ఇవ్వకపోవచ్చు. పాకిస్తాన్  నిరంతరం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఎడతెగని ఉగ్రదాడులతో  భారత జనాభా కూడా విసుగు చెందింది. పాకిస్తాన్‌‌కు పెద్ద గుణపాఠం నేర్పాలని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు.

 సింధూ నది ముప్పు

పాకిస్తాన్  పూర్తిగా  భారతదేశం నుంచి  ప్రవహించే  సింధు నదిపై ఆధారపడి ఉంది. చాలా ఉదారంగా, అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ 1960లో పాకిస్తాన్‌‌తో సింధు జల ఒప్పందంపై సంతకం చేశారు. అది శాంతిని ప్రారంభిస్తుందని ఆశిస్తున్నానని నెహ్రూ చెప్పారు. కానీ,  పాకిస్తాన్  సింధు గురించి అన్నీ మర్చిపోయి భారతదేశం పట్ల హింసాత్మకంగా మారింది.  సింధూ నది భారతదేశం నుంచి కాకుండా స్వర్గం నుంచి వచ్చినట్లుగా పాకిస్తాన్  ప్రవర్తించింది.

 ఏప్రిల్ 23, 2025న, భారతదేశం సింధు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు మోదీ  ప్రకటించారు. దీని అర్థం భవిష్యత్తులో పాకిస్తాన్‌‌కు తక్కువ నీరు లభిస్తుంది. ఇది పాకిస్తాన్‌‌కు అతిపెద్ద షాక్. భారత జల ఒప్పందాన్ని ఉల్లంఘించి హెచ్చరించడం 25 కోట్ల మంది పాకిస్తానీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మొత్తం మీద నిన్నటి రోజు పాక్​ ఉగ్రవ్యూహాలను (గుడారాలను) భారత్​ ధ్వంసం చేసింది. చేయాల్సినవి ఇంకా ఉండే ఉంటాయి.

పాకిస్తాన్ భవిష్యత్తు

పాకిస్తాన్ భారతదేశంపై ప్రతీకార దాడి చేస్తుందో లేదో ఎవరూ ఊహించలేరు. కానీ, ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.  మోదీ ఉండగా  పాకిస్తాన్  యుద్ధాలు చేయడానికి వెనుకాడుతుంది.  భారతదేశానికి  ఆదర్శవంతమైన విజయం అవసరం.  భారతదేశం ఓపికగా ఉండాలి.  పాకిస్తాన్,  చైనాతో శత్రుత్వం ఇంకా చాలా దశాబ్దాల పాటు ఉంటుందని తెలుసుకోవాలి. కానీ, ప్రస్తుతం నరేంద్ర మోదీ మార్పు  తెచ్చినట్లు కనిపిస్తోంది. భారతదేశానికి ప్రధాన శత్రుదేశాలైన  పాకిస్తాన్,  చైనా రెండింటినీ మనం న్యూట్రల్​ చేయగలమని ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులకు చూపించాడు. 

బంగ్లాదేశ్ వంటి దేశాలు భారతదేశంపై ఇకనుంచి  పెద్ద  మాటలు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు  జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుందని మోదీ పరోక్షంగా తెలియజేశారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ  తనదైన ఒక  సిద్ధాంతాన్ని సృష్టించాడు, ఆయన సిద్ధాంతం  భారతదేశం ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చెబుతున్నది. భారతీయులు తమ దేశానికి విలువైన చరిత్ర,  ఘనమైన కీర్తిని కలిగి ఉన్నందున దానికి మరింత తోడ్పడటానికి సిద్ధంగా ఉండటం నేర్చుకోవాలి.

మోదీ వ్యూహాలు

మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత పాకిస్తాన్ ఉగ్రవాద చర్య ప్రారంభించినప్పుడల్లా ఆయన ఎదురుదాడికి  ప్రాధాన్యతనిచ్చారు.  కాశ్మీర్‌‌కు ఆర్థిక శ్రేయస్సు తీసుకురావడానికి మోదీ అన్ని ప్రయత్నాలు చేశారు.  ఆర్టికల్ 370ని కూడా తొలగించి హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించారు. కాశ్మీర్‌‌ను  కొంతవరకు శాంతింపజేశారు. ప్రధాని మోదీలో  ఉన్న ఒక ప్రధాన లక్షణం ఏమిటంటే ఆయనకున్న  దృఢ సంకల్పం.  అతిపెద్ద రిస్క్‌‌లను తీసుకోవడానికి  సిద్ధంగా ఉంటారు. మోదీ ఇతర భారతీయ నాయకుల కంటే భిన్నంగా ఉన్నాడని పాకిస్తాన్  ప్రజలకు తెలుసు. మోదీ పేద  నేపథ్యం నుంచి వచ్చాడని,  ఉన్నత వర్గాలు ప్రదర్శించే  ‘మంచితనం’  లేదని పాకిస్తానీయులు కూడా గ్రహించారు.  మోదీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని అందరికీ అర్థమైంది.

- డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్–