రేపే జింబాబ్వేతో తొలి టీ20.. భారత్ ప్లేయింగ్ XIలో బిగ్ ట్విస్ట్.. వైభవ్, ఇషాన్ ఔట్!

రేపే జింబాబ్వేతో తొలి టీ20.. భారత్ ప్లేయింగ్ XIలో బిగ్ ట్విస్ట్.. వైభవ్, ఇషాన్ ఔట్!

Indian Team Playing XI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఎదురైన వరుస పరాజయాలను మరిచిపోయి, యువ భారత్ మళ్లీ గెలుపు బాట పట్టేందుకు సిద్ధమైంది. రేపు (జూలై 23న) హరారే వేదికగా జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20లో సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో సరికొత్త ఓపెనింగ్ కాంబినేషన్‌తో టీమిండియా బోణీ కొడుతుందో లేదోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హరారే పిచ్ రిపోర్ట్: 
హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించే బ్యాలెన్స్డ్ ట్రాక్. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించి స్పిన్నర్లకు మంచి గ్రిప్, టర్న్ లభిస్తుంది. ఆరంభంలో ఉండే సీమ్ మూవ్‌మెంట్‌ను పేసర్లు వాడుకుంటే బ్యాటర్లకు కష్టాలు తప్పవు.. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 156 పరుగులు కాగా, అత్యధిక టీ20 స్కోరు 229 పరుగులుగా ఉంది. ఇప్పటివరకు ఈ గ్రౌండ్ లో జరిగిన 41 టీ20 మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే 23 సార్లు గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం బెటర్. ఐపీఎల్ తరహా ఫ్లాట్ ట్రాక్‌లకు అలవాటుపడిన మన యంగ్ బ్యాటర్లకు ఈ పిచ్ సవాలుగా మారనుంది.

సరికొత్త ఓపెనింగ్ జోడీ.. వైభవ్, ఇషాన్ ఔట్: 
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు తోడుగా పంజాబ్ కింగ్స్ స్టార్ ప్రభుసిమ్రన్ సింగ్‌కు అవకాశం దక్కే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెఫ్ట్, రైట్ హ్యాండ్ బ్యాటింగ్ కాంబినేషన్ కుదరడం ప్రభుసిమ్రన్‌కు కలసివచ్చే అంశం. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే ఫినిషర్ రింకూ సింగ్‌ను పక్కనబెట్టాల్సి వస్తుంది. కాబట్టి వైభవ్‌కు తొలి మ్యాచ్‌లో నిరాశ తప్పకపోవచ్చు. విదేశీ గడ్డపై తడబడుతున్న ఇషాన్ కిషన్ స్థానంలో కీపర్‌గా ప్రభుసిమ్రన్ సింగ్ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ కూడా ఉంది. 

శ్రేయస్, తిలక్ వర్మకు పరీక్ష: 
మూడో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బరిలోకి దిగుతారు. కెప్టెన్‌గా వ్యూహాలు, ఫీల్డింగ్ మార్పుల్లో శ్రేయస్ నిరూపించుకోవాల్సి ఉండగా, తిలక్ వర్మ నిలకడగా ఆడి విమర్శకులకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఐదో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే, ఆరో స్థానంలో ధనాధన్ ఫినిషర్ రింకూ సింగ్ సేవలు అందించనున్నారు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్‌గా యువ ఆటగాడు హర్ష్ దూబేకు మంచి ఛాన్స్ లభించగా, ప్రధాన స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ రంగంలోకి దిగుతాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్ తమ స్థానాలు ఖాయం కాగా, మూడో పేసర్ స్థానం కోసం మయాంక్ యాదవ్, అశోక్ శర్మ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది. 

ఆ ముగ్గురిపైనే అందరి దృష్టి: 
ముఖ్యంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబేల ప్రదర్శనపై అందరి కళ్లు ఉన్నాయి. ఇటీవల వరుసగా విఫలమవుతున్న ఈ ముగ్గురు మరోసారి సత్తా చాటి భారత జట్టును విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత వీరిపైనే ఉంది.