- రాజధానుల్లో ఢిల్లీ టాప్, దేశాల పరంగా ఇండియా 3, బంగ్లాదేశ్ టాప్
- స్విట్జర్లాండ్ కంపెనీ ఎయిర్విజువల్, గ్రీన్‌పీస్ స్టడీ
- పంట వ్యర్థాలు కాల్చడం వల్లే మనకు సమస్యని వెల్లడి
రెండేండ్ల కిందటి వరకూ చైనా ప్రధాన నగరాలు కాలుష్యంతో నిండిపోయేవి. బీజింగ్, షాంఘై వంటి సిటీలను పొగ మంచు, దుమ్ము ధూళి ముంచేసేవి. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని చిన్నచిన్నగా మన దేశం భర్తీ చేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరాల జాబితాలో టాప్ 30లో 22 సిటీలు మనవే. మొన్న మొన్నటివరకు ఈ జాబితాలోనే చోటు సంపాదించిన చైనా రాజధాని బీజింగ్ ఇప్పుడు 122వ స్థానానికి వెళ్లిపోయి మెరుగైంది. ఇక, ప్రపంచంలో అత్యంత కాలుష్యకారక దేశాల్లో బంగ్లాదేశ్ టాప్‌లో ఉంటే, పాకిస్థాన్ రెండు, ఇండియా మూడో స్థానాల్లో నిలిచాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్విజువల్, గ్రీన్‌పీస్ సంస్థలు స్టడీ చేసి ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఏడాది సగటు గాలి నాణ్యతను లెక్కలోకి తీసుకుని ఈ జాబితాను తయారు చేశాయి కంపెనీలు. టాప్ 30 కాలుష్యకారక నగరాల్లో 8 సిటీలు పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనావి ఉన్నాయి.
పంట వ్యర్థాలు కాల్చడం వల్లేనా?
కొద్ది రోజుల కింద ఢిల్లీ గాలి ఎంత ప్రమాదకరంగా మారిందో తెలిసిందే. మరి అంత కాలుష్యానికి కారణం ఏంటి? వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే పొగేనా? అంటే.. అవీ కారణమైనా, మంటకు గాలి తోడైనట్టు ఢిల్లీ చుట్టుపక్కల రైతులు పంట వ్యర్థాలను కాల్చడమూ కాలుష్యం పెరగడానికి కారణమైంది. అన్నీ కలిసి ఢిల్లీ, ఆ పరిసర ప్రాంతాల గాలిని పాడుచేశాయి. అయితే, ఒకప్పుడు చైనాకు అదే ప్రధాన సమస్యగా ఉండేదని, ఇప్పుడు దానిని తగ్గించేలా ఆ దేశం చర్యలు చేపట్టడంతో పంట వ్యర్థాలను కాల్చడం తగ్గిందని ఐక్యూ ఎయిర్విజువల్, గ్రీన్పీస్లు వెల్లడించాయి. అందుకే చైనాలో కాలుష్యం చాలా వరకు తగ్గిందని తెలిపాయి. మన దేశం విషయంలో మాత్రం ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారిందని చెప్పాయి. ‘‘ఇండియా కాలుష్యం ఎక్కువవడానికి కారణం పంట వ్యర్థాలను తగులబెట్టడమే. అందులో ఎలాంటి సందేహం లేదు” అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ థామస్ స్మిత్ చెప్పారు. చైనా ఆ విషయంలో చర్యలు తీసుకుని సక్సెస్ అయిందన్నారు. ఇండియాలో, ప్రత్యేకించి ఢిల్లీలో పంట వ్యర్థాలను కాల్చడం ఎక్కువైందని అన్నారు. ప్రస్తుతం చలికాలం ఎంటరవడంతో గాలిలోనే కాలుష్యకారకాలు నిలిచిపోయాయని, దాని వల్ల పరిస్థితి మరింత విషమిస్తోందని చెప్పారు.
యూరప్, అమెరికాలతో పోలికేంటి?
కొద్ది రోజులుగా ఇండియా ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలతో పోలిస్తే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్లలో కాలుష్యం చాలా తక్కువగా ఉందని ఎయిర్ విజువల్ పేర్కొంది. అయితే, ఎప్పుడూ అదే పరిస్థితి ఉండడానికి అవకాశం లేదని చెప్పింది. ఉదాహరణకు 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం ప్రారంభం వరకు లండన్‌లో కాలుష్యం చాలా డేంజర్ స్థాయిలో ఉండేదని గుర్తు చేసింది. 1952లో లండన్‌ను గ్రేట్ స్మాగ్ ముప్పు తిప్పలు పెట్టిందని, కొన్ని రోజుల పాటు జనజీవనం అస్తవ్యస్తమైపోయిందని వివరించింది. ప్రస్తుత ఢిల్లీ పరిస్థితితో పోలిస్తే అప్పటి లండన్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని పేర్కొంది. ఆ కాలుష్యం వల్ల దాదాపు వేలాది మంది చనిపోయారని వివరించింది. థేమ్స్ నది ఒడ్డున ఉన్న పవర్ స్టేషన్ల వల్లే చాలా కాలుష్యం జరిగిందని సైంటిస్టులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు గాల్లో అత్యంత విషవాయువులున్నాయని, ఇప్పుడు ఢిల్లీలోనూ అదే పరిస్థితి ఉన్నా లండన్‌తో పోలిస్తే తక్కువేనని అంటున్నారు. అయినా ఢిల్లీ పరిస్థితి చాలా సీరియసేనని పేర్కొంది.
ప్రపంచంలో అత్యంత కాలుష్యకారక దేశాలు
బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇండియా, ఆఫ్గనిస్థాన్, బహ్రెయిన్, మంగోలియా, కువైట్, నేపాల్, యూఏఈ, నైజీరియా, ఇండోనేసియా, చైనా, వియత్నాం, శ్రీలంక, థాయిలాండ్
కాలుష్యకారక రాజధానులు
ఢిల్లీ (ఇండియా), ఢాకా (బంగ్లాదేశ్), కాబూల్(ఆఫ్గనిస్థాన్), మనామా (బహ్రెయిన్), ఉలాంబతార్ (మంగోలియా), కువైట్ సిటీ (కువైట్), కాట్మాండు (నేపాల్), బీజింగ్(చైనా), అబుధాబి (యూఏఈ), జకార్తా (ఇండోనేసియా), కంపాలా (ఉగాండా), హనోయి (వియత్నాం), ఇస్లామాబాద్(పాకిస్థాన్)

