కాల్పుల విరమణకు ఇండియా, పాకిస్తాన్ ఓకే చెప్పాయి : ట్రంప్ సంచలన ప్రకటన

కాల్పుల విరమణకు ఇండియా, పాకిస్తాన్ ఓకే చెప్పాయి : ట్రంప్ సంచలన ప్రకటన

శాంతి.. శాంతి.. శాంతి.. ఇండియా, పాకిస్తాన్ దేశాలు ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేశాయి.. రెండు దేశాలు కాల్పుల విరమణకు..బాంబు దాడులకు గుడ్ బై చెప్పాయి..ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించటం సంచలనంగా మారింది. 2025, మే 10వ తేదీ సాయంత్రం ఈ మేరకు ట్రంప్.. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన సుదీర్ఘమైన చర్చల తర్వాత.. భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు తక్షణమే ఒప్పందం చేసుకున్నాయని ప్రకటించటానికి సంతోషంగా ఉన్నాను అంటూ ట్రంప్ వెల్లడించారు. కామన్ సెన్స్ ఉపయోగించిన రెండు దేశాలకు అభినందనలు, ధన్యవాదాలు అంటూ ట్రంప్ కామెంట్ చేశారు. ఈ పోస్ట్‌ను అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కూడా షేర్ చేశారు.  

ఇండియా-,పాక్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం ( మే 10) సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ లో భాగంగా కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు.

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ, సైనిక చర్యలు నిలిపివేయడంపై విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా స్పష్టత ఇచ్చారు. కాల్పులు ,సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్,పాకిస్తాన్ శనివారం మే(10) ఒక అవగాహనకు వచ్చాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ నిరంతరం రాజీలేని వైఖరిని కొనసాగిస్తోందని.. ఇకముందు కూడా కొనసాగిస్తుందని జైశంకర్ ట్వీట్ చేశారు. 

కాల్పుల విరమణపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ప్రకటన చేశారు. పాకిస్తాన్ ,భారతదేశం తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి.. శాంతి,భద్రత కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అని దార్ ట్వీట్ చేశారు.

భారత్, పాకిస్తాన్ మధ్య గడిచిన కొద్ది సంవత్సరాల్లో అత్యంత తీవ్రమైన సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏప్రిల్ 22, 2025న పహల్గాంలో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 26మంది అమాయకపు టూరిస్టులు ప్రాణాలు కోల్పోవడంతో భారత్  ఈ దాడిని సీరియస్ గా తీసుకుంది.  ఈ క్రమంలో ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని ప్రకటించారు. 

మే 7, 2025 న భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను మెరుపు దాడులు నిర్వహించింది భారత సైన్యం..ఈ దాడుల్లో పాక్ లోని పలు ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం అయ్యాయి. కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే భారత్ చేస్తే.. పాకిస్తాన్ మాత్రం సరిహద్దుల్లోని భారత్ ప్రాంతాలపై దాడులు చేసింది..దీంతో శనివారం భారత్ సాయుధ దళాల అధిపతులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పాక్ కాల్పుల విరమణకు..బాంబు దాడులను నిలిపివేయడం భారత్ ఆగ్రహానికి గురికాకుండా వెనక్కి తగ్గినట్లే అని తెలుస్తోంది.