
న్యూఢిల్లీ: పుల్వామా, యురీ ఘటనలతో భారత్ పాకిస్థాన్ సంబంధాల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఇక జమ్మూ కశ్మీర్ విభజనతో భారత్‌పై దాయాది సీరియస్‌గా ఉంది. ఆర్టికల్ 370ని ఉపసంహరించుకునేంత వరకు ఇండియాతో సంబంధాల పునరుద్ధరణకు ఒప్పుకోబోమని పాకిస్థాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత్ పాక్ టాప్ ఇంటెలిజెన్స్ అధికారులు రహస్యంగా కలుసుకున్నారన్న వార్త ఆసక్తిని రేపుతోంది. ఈ ఏడాది జనవరిలో ఇరు దేశాల ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ దుబాయ్‌లో సీక్రెట్ సమావేశం నిర్వహించారని తెలిసింది. కశ్మీర్‌లోని వివాదాస్పద హిమాలయ ప్రాంతంలో ఉద్రిక్తతల గురించి చర్చిందేందుకు అధికారులు చర్చలు జరిపారని జాతీయ మీడియా సమాచారం ప్రకారం తెలుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్‌కు పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.