
మామూలుగా నీళ్లు నిప్పును ఆర్పుతాయి. సమయం, సందర్భాన్ని బట్టి ఆ నీళ్లే ఒక్కోసారి మంటలకు కారణమవుతాయి. వ్యక్తుల మధ్య, దేశాల మధ్య చిచ్చు పెడతాయి. యుద్ధంలో ఆయుధంగా మారతాయి. పుల్వామా ఎటాక్ క్రమంలో పాకిస్థా న్ కి నీళ్లు బంద్ చేయాలని ఇండియా నిర్ణయించింది. దీంతో ‘ఇండస్ వాటర్స్ ట్రీటీ’ మరోసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్థాన్‌పై ఇండియా సర్జికల్ స్ట్రయిక్స్–2 జరపడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా కోణాల్లో చెడిపోయేలా ఉన్నాయి. పుల్వామాలో మిలిటెంట్ దాడి జరగ్గానే ‘పాక్‌కి నీళ్లు బంద్ చేస్తాం ’అని కేంద్రం ప్రకటించింది. మన దేశం నుంచి పాకిస్థాన్‌కి మొత్తం ఆరు నదుల నుంచి నీళ్లు పారతాయి. వాటిలో సింధు నదిపై కుదిరిన ఒప్పందం కీలకమైంది.
తాజా హెచ్చరికలు, సర్జికల్ స్ట్రయిక్స్ తో మరోసారి ఈ ఒప్పందంపై చర్చ సాగుతోంది. 1960 నాటికి దేశ విభజన జరిగి 13 ఏళ్లు గడిచాయి. ఇండో–పాక్ మధ్య జల సంబంధాలు కుదుటపడకపోవటంతో వరల్డ్ బ్యాంక్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. సింధు జలాల పంపిణీ ఒప్పం దాన్ని (ఇండస్ వాటర్ ట్రీటీ) కుదిర్చింది. దీని ప్రకారం పశ్చిమ వైపునకు ప్రవహించే నదులైన ఇండస్, జీలం, చీనాబ్ లలోని నీటిని పాకిస్థాన్ కు కేటాయించింది. తూర్పు దిశగా ప్రవహించే నదులైన రావి, బియాస్ , సట్లెజ్ లలోని నీటిని ఇండియాకి పంచింది. ఇండస్ రివర్ సిస్టంలోని ఈ నదుల నీళ్లు ఇండో–పాక్ నడుమ వార్ వెపన్‌గా మారకుండా ఈ ఒప్పందం సేఫ్ గార్డ్‌లా నిలిచింది. ట్రీటీ ప్రకారం ఇండియా పాకిస్థాన్ ఆఫీసర్లు ఏటా రెండుసార్లు సమావేశమవ్వాలి. రెండు దేశాల్లోనూ ఈ నదులపై కట్టిన ప్రాజెక్టుల వద్దకు వెళ్లి అక్కడి వాస్తవ నీటి ప్రవాహాలను, వాడుకుంటున్న నీటి పరిమాణాన్ని పరిశీలించాలి.
ఆ డేటాని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి. గొడవలకు దారి తీసే అంశాలపై చర్చించుకొని పరిష్కరించుకోవటానికి మెకానిజాన్ని ఏర్పాటు చేయాలి. కానీ.. 2016లో జమ్మూ–కాశ్మీర్ లోని ఉరీ సైనిక స్థావరంపై పాక్ కు చెందిన జైషే మహ్మద్ టెర్రరిస్టులు దాడి చేయటంతో ఈ చర్చల మెకానిజాన్ని ఇండియా సస్పెండ్ చేసింది. తూర్పు దిశగా ఇండియా నుంచి పాక్ లోకి ప్రవహిస్తున్న మూడు(రావి, బియాస్, సట్లెజ్ ) నదుల నీటిలో మన దేశం ఇన్నాళ్లూ వాడుకోని వాటాను ఇకపై వాడుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు షార్పుర్ కండి, ఉజ్ ప్రాంతాల్లో మల్టీపర్పస్ డ్యామ్ లను; బియాస్ సట్లెజ్ రివర్ లింకింగ్ ప్రాజెక్టును ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో నిర్మిస్తామని చెప్పింది.
ఇండియా ఎందుకు వాడుకోలేదు?
ఉరీ అటాక్ క్రమంలో.. అసలు ఇండియా తనకు కేటాయించిన నీటిని సద్వినియోగం చేసుకోకుండా పక్క దేశానికి ఎందుకు వదిలేస్తోందనే ప్రశ్న తలెత్తింది. పూర్తిగా ఇండియా పరిధిలోనే ఉన్న రావి, బియాస్ , సట్లెజ్ నదుల్లోని నీటిని వంద శాతం ఉపయోగించుకునే సర్వధి కారాలూ మనకే ఉన్నా గానీ, పొరుగు దేశానికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందనే డౌటు కూడా వచ్చింది. విద్యుత్ ఉత్పాదనకో, వ్యవసాయానికో వాడుకోవచ్చు కదా అని పాలకులు ఆ దిశగా ఆలోచించటం మొదలెట్టారు. అయితే, అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మన దేశం ఈ మూడు నదుల్లోనూ పది శాతం నీటినే పాక్ కి వదిలేస్తున్నట్లు తేలింది. ఒక రకంగా అంతర్రాష్ట్ర జల వివాదం తలెత్తకుండా మన దేశం జాగ్రత్త పడింది. జమ్మూ–కాశ్మీర్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఈ నీటి కోసం 40 ఏళ్లుగా తగువులాడుతున్నాయి. ఈ గొడవ 201 8లో కొలిక్కి వచ్చిం ది. షాపూర్ కాండి డ్యామ్ నిర్మాణానికి కేంద్రం జోక్యం చేసుకొని జమ్మూ–కాశ్మీర్, పంజాబ్ మధ్య ఒప్పందం కుదిర్చింది. దాని ప్రకారం డ్యామ్ నిర్మాణం 2020లో కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి సామర్థ్యం 206 మెగావాట్లు. ఈ పవర్ ని జమ్మూకాశ్మీర్, పంజాబ్ పంచుకుంటాయి. రెండు రాష్ట్రాల్లోని 37,173 హెక్టార్లపైగా భూమి సాగులోకి వస్తుంది. ఇందులో 5,000 హెక్టార్ లు పంజాబ్ పరిధిలోకి వస్తుండగా, మిగతాది జమ్మూలోని కథువా రీజియన్ పరిధిలోని భూమి. ఇది సాధ్యం కావాలంటే ఇండియా 100 మీటర్ల ఎత్తున డ్యామ్ కట్టాలి.
సింధు ట్రీటీ వివరాలు
ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య వరల్డ్ బ్యాంక్ ‘సింధు నదీ జలాల పంపిణీ ఒప్పం దం’ కుదిర్చింది. ఇండియాకి పడమర నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలపై పాకిస్తాన్‌కు పూర్తి హక్కులు దక్కాయి. దీని ద్వారా ఆ నదుల్లోని 80 శాతం జలాలు పాకిస్థాన్. ఇక, తూర్పు నదులుగా చెప్పే రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాల్ని ఇండియాకు కేటాయించారు. ఈ మూడు నదుల నుంచి ఇండియాకి 33 మి.ఎకరాల అడుగుల (ఎంఏఎఫ్) నీళ్లు లభించాయి. రావి, బియాస్, సట్లెజ్ లపై డ్యామ్‌లు నిర్మించి, 95 శాతం నీటిని మన అవసరాలకు వాడుకుంటున్నాం. మిగిలిన 5 శాతం (1.6 ఎంఏఎఫ్) నీళ్లు మాత్రమే పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తున్నాయి. ఈ నీళ్లను కూడా వాడుకోవడం కోసం 100 మీటర్ల ఎత్తున షాపూర్–కాంది డ్యామ్ కట్టాలని ఇండియా నిర్ణయించింది. ఈ డ్యామ్ నిర్మాణానికి ఆరేళ్లు పడుతుందని అంచనా.