IND vs ENG: 12 ఏళ్ళ తర్వాత తొలిసారి.. త్రిమూర్తులు లేకుండానే తొలి టెస్ట్

IND vs ENG: 12 ఏళ్ళ తర్వాత తొలిసారి.. త్రిమూర్తులు లేకుండానే తొలి టెస్ట్

ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా తొలి టెస్ట్ ఆడుతుంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇదిలా ఉండగా టీమిండియా వెటరన్ ప్లేయర్స్ ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. ఈ త్రయం లేకుండా భారత్ టెస్టు మ్యాచ్ ఆడటం 12 ఏళ్ళ తర్వాత ఇదే తొలిసారి కావటం విశేషం. చివరిసారిగా 2011 లో వెస్టిండీస్ తో భారత్ స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో కోహ్లీ, రహానే, పుజారా లేకుండా ఆడింది.

దశాబ్ధకాలంగా భారత టెస్టు జట్టులో పుజారా, కోహ్లీ, రహానే కీలక ప్లేయర్లుగా కొనసాగారు. 3,4,5 స్థానాల్లో వీరు బ్యాటింగ్ చేస్తూ భారత్ సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు ప్లేయర్లు నేటి మ్యాచ్ లో లేకపోవడం భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఫామ్ లేమితో పుజారా, రహానే భారత జట్టుకు దూరమయ్యారు. మరోవైపు కోహ్లీ వ్యక్తిగత కారణాల వలన తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్నాడు. 

ఈ ముగ్గురు సీనియర్ ప్లేయర్ల స్థానాల్లో శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగుతున్నారు. కోహ్లీ ఇప్పటివరకు 113 టెస్టులు ఆడగా.. పుజారా 103, రహానే 85 టెస్ట్ మ్యాచ్ లాడారు. కోహ్లీ మూడో టెస్టు నుంచి టీమిండియాకు అందుబాటులో ఉంటాడు.  2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో ఈ వెటరన్ ప్లేయర్ 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు. 

రహానే 2022 లో దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత పేలవ ఫామ్ తో టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు సంపాదించిన రహానే రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 89,46 పరుగులు చేశాడు. కెరీర్ గాడిలో పడిందనుకున్న సమయంలో  జులైలో విండీస్ టూర్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమవడం రహానేకు ప్రతికూలంగా మారింది.