2060 నుంచి జనం తగ్గుతరు

2060 నుంచి జనం తగ్గుతరు

చిన్న కుటుంబాలే మనకు కరెక్ట్ అని, జనాభా పెరుగుదలను కంట్రోల్​చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఇండిపెండెన్స్​డే  ప్రసంగంలో పిలుపునిచ్చారు. మరో ఏడేండ్లలో భారతదేశ జనాభా చైనాను మించిపోయి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా మారనున్న నేపథ్యంలో జనాభా పెరుగుదలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దేశ జనాభా పెరగడం నిజమే అయినప్పటికీ, కొన్నేండ్లలోనే పరిస్థితి చేతుల్లోకి వస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదికలు చెబుతున్నాయి. దేశ జనాభా పెరుగుదల రేటు  ఇప్పటికే స్థిరంగా కొనసాగుతోందని, సమీప భవిష్యత్తులోనే ఇది క్రమంగా క్షీణిస్తుందని పేర్కొంటున్నాయి.

2060 నాటికి165 కోట్లు

ఇండియా జనాభా 2026 నాటికి 130 కోట్లు దాటి  చైనాను మించిపోతుందని ఐక్యరాజ్యసమితి నిపుణులు చెబుతున్నారు. 2060 నాటికి దేశ జనాభా 165 కోట్లకు చేరుతుందని  అంటున్నారు. అయితే, ఆ తర్వాత క్రమంగా తగ్గడం మొదలవుతుందని స్పష్టం చేస్తున్నారు. అంతకు ఒకట్రెండు దశాబ్దాల ముందే జనాభా తగ్గడం మొదలు కావచ్చనీ పేర్కొంటున్నారు. ఆఫ్రికాలో మాత్రం ఈ శతాబ్దమంతా జనాభా పెరుగుతూనే ఉంటుందని, 2060ల నాటికి 300 కోట్లు దాటుతుందని అంటున్నారు.

సంతాన రేటు తగ్గడం వల్లే..

ప్రపంచంలో సగటు సంతాన రేటు 2.1గా ఉన్నట్టు  ఐక్యరాజ్యసమితి అంచనా. ఇండియాలో కూడా ఈ సంతాన రేటు  2.2కు పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు.  ఇంటర్నేషనల్ ​ఇనిస్టిట్యూట్ ​ఫర్ ​పాపులేషన్ ​సైన్సెస్ ​(ఐఐపీఎస్) అంచనాల ప్రకారం, 2031 నాటికి బీహార్ సహా అన్ని ప్రధాన రాష్ట్రాల్లో సంతాన రేటు సగటు 2.1 కన్నా తక్కువకు పడిపోతుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎకనామిక్ ​సర్వే ప్రకారం చూసినా, ఇండియా జనాభా పెరుగుదల వచ్చే రెండేళ్లలో నెమ్మదిస్తుందని తేలింది. 2021–31 మధ్య ఏటా 1%, 2031–41 మధ్య ఏటా 0.5% మాత్రమే జనాభా పెరుగుతుందని అంచనా వేశారు. అలాగే 2021 నాటికి చాలా రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ రేటు సగటు కన్నా పడిపోతుందని, జీవనకాలం పెరుగుదల వల్ల మాత్రమే జనాభా పెరుగుదల అనేది కొనసాగుతుందని చెబుతున్నారు.

అన్ని మతాల్లోనూ అవగాహన

సంతాన రేటు అనేది ప్రధానంగా ఆస్తి, చదువు, అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. చదివిన చదువును బట్టి,  ధనిక కుటుంబాల సంఖ్య​పెరిగే మతాల్లోనూ సంతాన రేటు తక్కువగా ఉంది.  ఇందుకు జైన మతస్తుల జనాభాను చక్కని ఉదాహరణగా చెబుతారు.  ఇటు ముస్లిం కుటుంబాల్లోనూ సంతాన రేటు చాలా వరకు పడిపోయింది. సగటున ఒక్కో ముస్లిం కుటుంబంలో ముగ్గురు పిల్లలకు సంతాన రేటు పడిపోయింది. రానున్న రోజుల్లో అన్ని మతాల్లోనూ విద్య, సంపద పెరుగుతుందని, తద్వారా ఫెర్టిలిటీ రేటు తగ్గి, ఆయా మతాల్లో జనాభా పెరుగుదల రేటు కూడా తగ్గుతుందని చెబుతున్నారు.   2015–17లో ప్రతి 1000 మంది పురుషులకు 896 మంది మహిళలే ఉన్నారు. అంతకుముందు 2014–16లోనూ 929గా ఉండేది.  అంటే ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి, భవిష్యత్తులో వీరి వల్ల పుట్టబోయే పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతుంది. దీంతో సంతాన రేటు 2.15–2.2 మధ్యలో ఉంటుందని ఐఐపీఎస్ నిపుణు​లు చెబుతున్నారు.