న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించేందుకు కార్లు, బస్సులు వంటి ప్రయాణికుల వాహనాలకు (పీవీ) బీఎస్–7 ఎమిషన్ స్టాండర్డ్స్ను 2029 ఏప్రిల్ నుంచి అమలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. ఇది జారీ చేసిన ముసాయిదా ప్రకారం 2029 ఏప్రిల్ నుంచి తయారయ్యే ఎం–1 కేటగిరీ ప్రయాణికుల కార్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణలపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయడానికి నెల గడువు ఇచ్చింది. 2020 ఏప్రిల్ నుంచి బీఎస్ –6 ప్రమాణాలు కొనసాగుతున్నాయి. బీఎస్–7 ప్రమాణాలను 2029, 2031, 2035లో మూడు దశల్లో అమలు చేస్తారు.
ఒకటో దశ నిబంధనల అమలుకు వాహన తయారీదారులకు 2.5 ఏళ్ల సమయం లభిస్తుంది. ల్యాబొరేటరీ పరీక్షలతో పాటు వాస్తవ డ్రైవింగ్ ఉద్గార పరీక్షలు, రోడ్లపై తిరుగుతున్న వాహనాల తనిఖీల ద్వారా కంపెనీలు ప్రమాణాలను నిరూపించుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాలను కూడా బ్యాటరీ మన్నిక, బ్రేక్ పార్టికల్ నిబంధనలతో ఈ పరిధిలోకి తెచ్చారు.
