ఉత్తరాది విలవిల.. కుండపోత వర్షాలు..ఢిల్లీలో ఉప్పొంగిన యమున.. ఇండ్లలోకి నీళ్లు

ఉత్తరాది విలవిల.. కుండపోత వర్షాలు..ఢిల్లీలో ఉప్పొంగిన యమున.. ఇండ్లలోకి నీళ్లు
  • గురుగ్రామ్​లో అర్ధరాత్రి దాకా 20 కి.మీ. ట్రాఫిక్ జామ్ 
  • పంజాబ్​లో పొంగిపొర్లిన నదులు.. లోతట్టు ప్రాంతాలు జలమయం 
  • జమ్మూకాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్​లో ఆకస్మిక వరదలు.. విరిగిపడిన కొండచరియలు


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు వణికిస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది డేంజర్ లెవల్ దాటి ప్రవహిస్తుండటంతో నది పరిసర ప్రాంతాల్లోని రోడ్లపైకి, ఇండ్లలోకి వరద నీళ్లు పోటెత్తుతున్నాయి. నిరంతర వర్షాలకు గురుగ్రామ్ లో గంటల తరబడి, కిలోమీటర్ల దూరం వరకూ ట్రాఫిక్ జాంలతో జనం నరకం చూస్తున్నారు. పంజాబ్ లోనూ కొన్నిరోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అన్ని ప్రధాన నదులు, వాగులు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో రోజూ అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే, ఉత్తరాది రాష్ట్రాలకు మరో 5 రోజుల వరకూ ఊరట లభించే అవకాశంలేదని ఐఎండీ వెల్లడించింది. ఢిల్లీ, యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఈ నెల 7వ తేదీ వరకూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

హిల్ స్టేట్స్​లో కొనసాగుతున్న క్లౌడ్ బరస్ట్​లు.. 

జమ్మూకాశ్మీర్​లో కొన్నిరోజుల్లోనే ఆకస్మిక వరదల వల్ల 50 మంది చనిపోయారు. జమ్మూ– శ్రీనగర్ హైవే వరుసగా 8వ రోజు మూతపడింది. రాజౌరి, సాంబ జిల్లాల్లో నిరంతర వర్షాల వల్ల రెండు చోట్ల భూమి కుంగిపోయింది. ఇండ్లు దెబ్బతినడంతో 19 కుటుంబాలను అధికారులు తరలించారు. దోడా జిల్లాలోనూ ఆకస్మిక వరదల ధాటికి 500 ఇండ్లు దెబ్బతిన్నాయి. ఇక ఉత్తరాఖండ్​లో క్లౌడ్ బరస్ట్​లు, ఆకస్మిక వరదల వల్ల 10 మంది చనిపోయారు. మరో 69 మంది ఆచూకీ తెలియడంలేదు. పలు చోట్ల ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఇండ్లు దెబ్బతిన్నాయి. మంగళవారం కూడా రాష్ట్రానికి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. హిమాచల్​​లో ల్యాండ్​స్లైడ్స్, ఇండ్లు, గోడలు కూలడం వల్ల ఐదుగురు మృతిచెందారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 5 హైవేలు సహా 1,200 రోడ్లు క్లోజ్ చేశారు. అనేక చోట్ల కరెంట్ కట్ అయి చీకట్లు అలముకున్నాయి. చాటా చోట్ల పైప్ లైన్​లు దెబ్బతినడంతో తాగునీటి సరఫరా ఆగి జనం అవస్థలు పడుతున్నారు.

అర్ధరాత్రి దాకా ట్రాఫిక్ జామ్..

ఢిల్లీ ఎన్ సీఆర్ సమీప ప్రాంతాల్లోని బ్యారేజ్ ల నుంచి నీటి విడుదల కొనసాగుతోందని, వరదల ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రజలను అధికారులు హెచ్చరించా రు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అలర్ట్ జారీ చేశారు. గురుగ్రామ్, యూపీ, చండీగఢ్ లో మంగళవారం స్కూళ్లు మూతపడ్డాయి. గురుగ్రామ్ లో సోమవారం ఏకంగా 20 కిలోమీటర్ల వరకూ అర్ధరాత్రి దాటేదాకా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో మంగళవారం ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని చెప్పాయి. దీనివల్ల మంగళవారం రోడ్లపై వరద తగ్గకపోయినా ట్రాఫిక్ మాత్రం గణనీయంగా తగ్గినట్టు చెప్తున్నారు.  

ఢిల్లీలో ఉప్పొంగిన యమున..

ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్​ను దాటి ఉప్పొంగింది. ఓల్డ్ యమునా బ్రిడ్జి వద్ద నదీ ప్రవాహం ఉదయం 205.8 మీటర్లుగా నమోదైందని అధికారులు చెప్పారు. సాయంత్రానికి ఇది 206 మీటర్లు దాటిందన్నారు. హత్నీకుండ్, వజీరాబాద్, ఓఖ్లా బ్యారేజీల నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో యమున నీటి ప్రవాహం మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్సీఆర్ ప్రాంతంలో నదికి ఇరువైపులా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద ప్రవహిస్తోంది. పలుచోట్ల రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు ప్రవహిస్తుండగా, సమీపంలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. 

పంజాబ్​లో భారీ వరదలు.. 

పంజాబ్​లో గత 25 ఏండ్లలోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో వరదలు వచ్చాయి. ఇప్పటివరకు 29 మంది చనిపోగా, దాదాపు 2.46 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పంజాబ్ లో నదులు ఉప్పొంగడంతో దాదాపు 10 జిల్లాలు వరద ముంపు బారిన పడ్డాయి. ఈ నెలలో ఇప్పటివరకే 253.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది గత 25 ఏండ్లలోనే అత్యధికం అని, సాధారణం కంటే 74 శాతం ఎక్కువని ఐఎండీ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని, అధికారులంతా అలర్ట్ గా ఉండాలని సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు.