
న్యూఢిల్లీ: పంజాబ్‌లో అతి భారీ వర్షాలతో గత 50 ఏండ్లలో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. వేలాదిమంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
ఈ నెల 9న ఆయన గురుదాస్‌పూర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారని బీజేపీ పంజాబ్ విభాగం ‘ఎక్స్’లో వెల్లడించింది. సహాయ, పునరావాస కార్యక్రమాలు, అక్కడి పరిస్థితిని సమీక్షిస్తారని పేర్కొన్నది. వరద బాధిత ప్రజలు, రైతులను కలుసుకుంటారని తెలిపింది. బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటారని వివరించింది.