కోల్‌కతా: సొంతగడ్డపై టీమిండియా టఫ్ టెస్ట్‌కు రెడీ అయింది. వరల్డ్ టెస్టు చాంపియన్, బలమైన సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం తొలి టెస్టు షురూ అవనుంది. గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో టీమిండియా 0–3తో ఓడింది. కివీస్ స్పిన్నర్లు అజాజ్ పటేల్, మిచెల్ శాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్‌ను దీటుగా ఎదుర్కోలేక చతికిలపడింది. ఆ మూడు టెస్ట్‌ల్లో ముగ్గురు స్పిన్నర్లు కలిసి 36 వికెట్లు పడగొట్టారు.
ఈ నేపథ్యంలో అత్యంత నాణ్యమైన స్పిన్నర్లున్న సౌతాఫ్రికాతోనూ ఈ సిరీస్‌లో ఇండియాకు ముప్పు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో సఫారీ స్పిన్ త్రయం కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్, సెనురాన్ ముత్తుస్వామి 39 వికెట్లలో 35 పడగొట్టారు. దాంతో ఈ సిరీస్‌లో ఇండియా బ్యాటింగ్‌కు, సౌతాఫ్రికా స్పిన్‌కు మధ్య తీవ్రమైన పోరాటం జరిగే అవకాశాలున్నాయి. అదే టైమ్‌లో సఫారీ పేసర్లు కగిసో రబాడ, మార్కో యాన్సెన్ నుంచి కూడా ఇండియా బ్యాటర్లకు ప్రమాదం పొంచి ఉంది.
స్పెషలిస్ట్ బ్యాటర్‌గా జురెల్
వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆడిన జట్టులో ఒకటి, రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగుతోంది. గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా తీసుకున్నారు. అదే టైమ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సత్తా చాటిన ధ్రువ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించనున్నారు. దాంతో ఇండియా బ్యాటింగ్ డెప్త్ బాగా పెరిగింది. విండీస్‌పై బరిలోకి దిగిన సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని టీమ్ నుంచి తప్పించి ఇండియా–ఎ జట్టులో చేర్చారు.
మిగిలిన టీమ్‌లో ఎలాంటి మార్పుల్లేవు. పిచ్ పూర్తిగా స్పిన్‌కు అనుకూలం కాకపోవడం స్పీడ్ స్టర్ బుమ్రాను సంతోష పెట్టే అంశం. మ్యాచ్ చివర్లో రివర్స్ స్వింగ్‌కు అనుకూలమన్న సంకేతాల నేపథ్యంలో బుమ్రా కచ్చితంగా ప్రభావం చూపిస్తాడని అంచనా వేస్తున్నారు.
అయితే మరో పేసర్‌గా లోకల్ ప్లేయర్ ఆకాశ్ దీప్‌ను ఆడిస్తారా..? లేక సిరాజ్‌తోనే వెళ్తారా..? అన్నది తేలాల్సి ఉంది. స్పిన్నర్లలో జడేజా, సుందర్ బ్యాటింగ్‌లోనూ మెరుస్తుండటం కలిసొచ్చే అంశం. అయితే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మధ్య ప్లేస్ కోసం కాస్త పోటీ ఉంది. టాప్–4 బ్యాటింగ్‌లో గిల్, జైస్వాల్, రాహుల్, సుదర్శన్ సత్తా చాటాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
బౌలింగ్‌పైనే దృష్టి..
ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా ఎక్కువగా బౌలింగ్‌పైనే నమ్మకం పెట్టుకుంది. బలమైన పేస్ బలగంతో పాటు నాణ్యమైన స్పిన్నర్లు ఉండటం జట్టుకు అదనపు బలంగా మారింది. బ్యాటింగ్‌లో మార్‌క్రమ్, బవూమ, రికెల్టన్, స్టబ్స్‌పై భారీ ఆశలు ఉన్నాయి. మిడిలార్డర్‌లో స్టబ్స్, జోర్జి కీలకం కానున్నారు. అయితే వీళ్లంతా ఎన్ని రన్స్ చేసినా.. మ్యాచ్‌ను కాపాడేది మాత్రం స్పిన్నర్లే. దాంతో ముత్తుస్వామి, హార్మర్, కేశవ్ కీలకం కానున్నారు. పేసర్లు యాన్సెన్, రబాడ యాంకర్ పాత్రను సమర్థంగా పోషిస్తే సఫారీలకు తిరుగుండదు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
సౌతాఫ్రికా: టెంబా బవూమ (కెప్టెన్), ఐడెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టాన్ స్టబ్స్, టోనీ డి జార్జి, కైల్ వెరెన్, సెనురన్ ముత్తుస్వామి, సిమోన్ హార్మర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ.
పిచ్, వాతావరణం
పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. మ్యాచ్ జరిగే కొద్ది రివర్స్ స్వింగ్ ప్రభావం ఉంటుంది. వికెట్‌పై గడ్డి తక్కువగా ఉన్నా.. ఎండిపోవడం లేదా పగుళ్లు ఏర్పడే చాన్స్ లేదు. టాస్ ఓడిన జట్టుకు కష్టాలు తప్పవు.
- 1గిల్ కెప్టెన్‌గా ఏడు టెస్టుల్లో ఒకే సారి టాస్ గెలిచాడు. ఇండియాలో ఆడిన గత ఏడు టెస్టుల్లో సౌతాఫ్రికా ఒక్క సారి కూడా టాస్ గెలవలేదు.
- 10టెస్టుల్లో 300 వికెట్లు, 4 వేల రన్స్ చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలవడానికి జడేజాకు కావాల్సిన రన్స్.
- 5మరో ఐదుగురిని ఔట్ చేస్తే.. సౌతాఫ్రికా తరఫున టెస్టుల్లో వంద డిస్మిసల్స్ చేసిన ఐదో వికెట్ కీపర్‌గా వెరెన్ నిలుస్తాడు.
