
- దేశంలో 11% లోటు
- గత ఐదేండ్లలో ఇదే అత్యధికం
- దేశవ్యాప్తంగా 14.72 సెం.మీ.
న్యూఢిల్లీ: దేశంలో గత నెల లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయింది. 11 శాతం తక్కువ వర్షం కురిసిందని, గత ఐదేండ్లలో ఇదే అత్యధికమని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. వాస్తవానికి జూన్ లో 16.53 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 14.72 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైందని ఐఎండీ వెల్లడించింది. నాలుగు నెలల వర్షాకాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 87 సెం.మీ వర్షం కురుస్తుందని, ఇందులో జూన్ వాటా 15 శాతమని పేర్కొంది.
అయితే, జూన్ 11 నుంచి 27 వరకు 16 రోజుల తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపింది. ఐఎండీ డేటా ప్రకారం.. మే నెల 30న నైరుతి రుతుపవనాలు కేరళ, ఈశాన్య ప్రాంతంలోకి త్వరగా ప్రవేశించాయి. మహారాష్ట్ర వరకు సాధారణంగానే విస్తరించాయి. కానీ.. బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, యూపీలో రుతుపవనాలు నెమ్మదించాయి. జూన్లో వాయువ్య భారత్ లో 33%, మధ్య భారత్లో 14 %, తూర్పు, ఈశాన్య భారత్లో 13% చొప్పున లోటు వర్షపాతం నమోదయింది. దక్షిణ భారత్లో మాత్రమే 14 % మిగులు వర్షపాతం రికార్డు అయింది.
కొన్ని ప్రాంతాల్లోనే భారీ నుంచి అతిభారీ
దేశంలోని సబ్ డివిజనల్ ఏరియాకు చెందిన 12 % ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ (38%) వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది. ఆ ఏరియాలోని 50శాతం ప్రాంతంలో తక్కువ నుంచి మరీ తక్కువ వర్షపాతం రికార్డయింది. గత 25 ఏండ్లలో 20 సార్లు జూన్ నెలలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయింది. అదే టైంలో జులైలో సాధారణం లేదా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. కాగా.. దేశంలో ఈ ఏడాది
భారీ వర్షాలు కురుస్తాయని, 87 సెంటీమీటర్ల సగటు వర్షపాతం కన్నా ఎక్కువే వర్షాలు కురవవచ్చని ఐఎండీ ఇంతకుముందు అంచనా వేసింది.
ఈ నెలలో విస్తారంగా..
దేశంలో ఈ నెలలో ఒక్క ఈశాన్య భారత ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. సోమవారం వర్చువల్ గా మీడియాతో ఆయన మాట్లాడారు. జులైలో దేశ సగటు వర్షపాతం 28.04 సెంటీమీటర్ల కన్నా 106 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
ఈశాన్య భారత్ లోని చాలా ప్రాంతాలు, వాయువ్య భారత్ లోని కొన్ని ప్రాంతాలు మినహా తూర్పు, దక్షిణ భారత్ లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురవవచ్చు. అలాగే టెంపరేచర్లు కూడా పశ్చిమ తీరం మినహాయించి మిగతా దేశమంతా సాధారణంగానే నమోదవుతాయి” అని మృత్యుంజయ పేర్కొన్నారు.