సుప్రీంకోర్టు తీర్పుతో.. సమాన విద్య సాకారమయ్యేనా?

సుప్రీంకోర్టు తీర్పుతో.. సమాన విద్య సాకారమయ్యేనా?

‘ఒక రిక్షా  కార్మికుడి  పిల్లలు,  మల్టీ మిలియనీర్  లేదా  సుప్రీంకోర్టు న్యాయమూర్తి  పిల్లలతో  కలిసి ఒకే తరగతి గదిలో చదువుకున్నప్పుడే అసలైన సామాజిక మార్పు సాధ్యమవుతుంది’ అని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్‌లతో  కూడిన  సుప్రీంకోర్టు ధర్మాసనం 2026 జనవరి 13నాడు తీర్పునిచ్చింది.  

విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) కింద ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో  పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించిన 25% ఉచిత సీట్ల అమలుపై విచారణలో  అందరి బిడ్డలు కలిసి పాఠశాలలో  సంయుక్తగా కూర్చోవడం అనేది సహజ ప్రక్రియగా మారాలి. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. 

ఆర్టికల్ 21ఏ, 39(ఎఫ్‌) కింద దేశం చిన్నారులకు ఇచ్చిన హక్కు అని కోర్టు పేర్కొంది.  కు లం, తరగతి లేదా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఉండే 'అనుమానాస్పద గుర్తింపులను' పక్కన పెట్టి, విద్యార్థులు ఒకరితో ఒకరు మమేకంగా ఉండటానికి విద్యా హక్కు చట్టంలోని  సెక్షన్ 12 దోహదపడుతుందని ధర్మాసనం వివరించింది. 

సమాజంలోని అన్ని వర్గాల పిల్లలు వివక్ష లేకుండా విద్యను అభ్యసించే సాధారణ పాఠశాల వ్యవస్థపై గతంలో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదికను కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.  విద్యా హక్కు చట్టం లోని సెక్షన్ 12(1) (సీ) కింద ఉన్న ఆదేశాలను  క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా  అమలు చేయడానికి  తగిన  నియమ,  నిబంధనలను రూపొందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 

విద్యపై విలువైన తీర్పులు 

అలహాబాద్ హైకోర్టు,  సుప్రీంకోర్టు సమాన విద్యపై  విలువైన తీర్పులు ఇచ్చాయి.  మెకాలే 1835లో  చేసిన ప్రతిపాదనల ఫలితంగా దేశంలో ఆధునిక విద్య ప్రారంభమైంది.  ఇంగ్లిష్ విద్యకు ఆదరణ పెరగడంతో  దేశీయ విద్యాసంస్థలు  బలహీనపడ్డాయి.  ఫలితంగా పేదలకు, వెనకబడిన సామాజిక వర్గాలకు ఇంగ్లిష్ విద్య అందలేదు. 

1882లో సార్వత్రిక విద్యను అమలు చేయాలని జ్యోతిబా ఫూలే హంటర్ కమిషన్​ను  కోరారు.  స్వాతంత్ర్యానికి  పూర్వమే  సార్వత్రిక విద్య ఆవశ్యకతను 1911లో  గోపాలకృష్ణ  గోఖలే  కోరారు.  వార్ధాలో  కాంగ్రెస్ పార్టీ 1937లో  జరిపిన  సదస్సులో మహాత్మా గాంధీ  బేసిక్ విద్యను అమలు చేయాలని తీర్మానం  చేసినా,  నిధుల లేమితో  అది అమల్లోకి రాలేదు.  

రాజ్యాంగంలోని 21వ అధికరణంలోని ‘జీవించే హక్కును‘ 45వ అధికరణలోని విద్యా హక్కుతో కలిపి  చూడాలని, 3-–14 ఏళ్ల బాల బాలికలకు పూర్వ ప్రాథమిక విద్యతోపాటు  ఎలిమెంటరీ విద్యను తప్పనిసరిగా అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని 1993లో సుప్రీంకోర్టు ఉన్నికృష్ణన్ కేసులో స్పష్టమైన తీర్పునిచ్చింది. 

అర్థవంతమైన జీవితాన్ని పొందడానికి విద్యను హక్కుగా భావించి, 3-14 సంవత్సరాలలోపు బాల బాలికలకు ఉచితంగా నిర్బంధంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కావడంతో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది. 1992 లో జరిగిన యునెస్కో ‘బాలల హక్కు సదస్సు‘లో 18 సంవత్సరాల వయసు వచ్చేవరకు విద్యను అందించాల్సిన  బాధ్యత  ప్రభుత్వాలదేనని తీర్మానించింది.  పార్లమెంట్ ఆమోదించిన విద్యాహక్కు చట్టాన్ని ‘నూతన జాతీయ విద్యా విధానం-2020’ పూర్తిగా  నీరుకార్చే విధంగా ఉంది. 

మూతపడుతున్న వేలాది పాఠశాలలు

ఏటా  వేలాది  పాఠశాలలు  మూతపడుతున్నాయి. 2014-–2015,   2023–-2024  మధ్యకాలంలో  దేశవ్యాప్తంగా  89,441 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రభుత్వ పాఠశాలల కోసం తగినంత నిధులు కేటాయించాలని  విద్యా హక్కు చట్టం  చెప్తున్నది.  కానీ,  అటు కేంద్ర  ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గత 2014-– 2015 ఆర్థిక సంవత్సరాల నుంచి  విద్యకు కేటాయించే  నిధులను  తగ్గిస్తూ వస్తున్నాయి.  

కొఠారి  కమిషన్ నివేదిక  ప్రకారం కేంద్ర బడ్జెట్లో 10% ,  రాష్ట్ర  ప్రభుత్వ బడ్జెట్లో  30%  నిధులు కేటాయించాలి.  కానీ,  ఆచరణ అలా లేదు.  ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధిచేసి,  ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి, ఉచితమైన, నాణ్యమైన విద్యను  హక్కుగా  అందించే  కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.  అడుగడుగునా  విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ పాలకులు విద్యారంగంపై  విపరీతమైన  ప్రేమ ఒలకబోస్తూ  ప్రకటనలు చేస్తారు,  ఉపన్యాసాలు దంచుతారు. 

ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించేవిధంగా, అందుకు వారికి ప్రవేశాలు కల్పించేలా ప్రభుత్వం చూడాలి.  ఆ మేరకు వారికి ట్యూషన్ ఫీజును ప్రభుత్వమే రియంబర్స్​మెంట్​ చేయాలి.  ఏటా  నిధుల  కేటాయింపులో   పిసినారితనాన్ని  ప్రదర్శిస్తున్న  ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పును ఎలా అమలు చేస్తారో వేచి చూడాలి!

ఉచితంగా నాణ్యమైన విద్య  అందించాలి

ప్రపంచవ్యాప్తంగా  బాల బాలికలు అందరికీ ఉచితమైన నాణ్యమైన విద్య అందించాలని చాలా చర్చలు జరిగాయి.  చాలా ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాల్లో  భారతదేశం  అనేకసార్లు  సంతకాలు చేసింది.  అయినప్పటికీ ప్రాథమికస్థాయి  నుంచి 12వ  తరగతి  వరకు  ఉచితమైన,  నాణ్యమైన,  గుణాత్మక విద్య  అందిస్తామని  అంగీకరించినప్పటికీ  అమల్లోకి  తేవడంలో   విపరీతమైన  నిర్లక్ష్యం గోచరిస్తుంది.  

అదే  విషయాన్ని  దేశవ్యాప్తంగా అనేకసార్లు  ఉన్నత  న్యాయస్థానాలు  తమ తీర్పుల ద్వారా  ప్రభుత్వాలపై  మొట్టికాయలు వేసినప్పటికీ,  ప్రభుత్వాల్లో చలనం లేదు.  పైగా అందరికీ విద్యను  అందించే  విషయంలో ఆచరణాత్మకమైన నిజాయితీతో  కూడిన చర్యలేవి ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. 

సమాజంలో ప్రతి బాలుడికి బాలికకు స్వేచ్ఛ, సమానత్వాలతో  కూడిన  విద్య అవకాశాలను కచ్చితంగా అందించడమే ఈ సమాన విద్య భావన.  ఇది ఒక రకంగా 14 సంవత్సరాల వరకు బాల బాలికలకు  నిర్బంధంగా  విద్యను  అందించడం  అవుతుంది.  140  ఏళ్లుగా  జరిగిన  పోరాట  ఫలితంగా  రూపొందించిన  విద్యాహక్కు  చట్టాన్ని  అమలుచేసే  క్రమంలో  మన  ప్రభుత్వాలు  పూర్తిగా వైఫల్యం చెందాయి. 

ప్రభుత్వాలు  తాము చేసిన  చట్టాన్ని  తామే  ఉల్లంఘిస్తున్న పరిస్థితుల్లో  కోర్టులు  మొట్టికాయలు పెట్టినప్పటికీ బాల బాలికలకు సమాన విద్యా అందించే  కృషిలో  వైఫల్యం చెందుతున్నాయి.  బడుగు, బలహీనవర్గాలకు విద్యను అందించడానికి పౌర సమాజం పూర్తి బాధ్యత  తీసుకోవాల్సిన అవసరం ఉంది.

-  కె. వేణుగోపాల్, విద్యారంగ విశ్లేషకుడు-