న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో వినియోగించిన మార్కర్ పెన్స్ వివాదంపై ఆయన శుక్రవారం స్పందించారు. కెమికల్స్‌తో కడిగితే ఓటర్లకు చేసిన మార్కింగ్ తొలగిపోతున్న వీడియోలను, మీడియా రిపోర్టులను సోషల్ మీడియా ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘మన ప్రజాస్వామ్యంలో నమ్మకం ఎలా దెబ్బతింటున్నదో చూడండి. ఎలక్షన్ కమిషన్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నది. ఓట్ చోరీ.. దేశ ద్రోహం” అని పేర్కొన్నారు.
కాగా, మహారాష్ట్రలో గురువారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం అధికారులు మార్కర్ పెన్స్ వినియోగించారు. అయితే, అందులోని ఇంక్ క్వాలిటీగా లేదని, ఓటర్లకు మార్కింగ్ చేసిన తర్వాత.. ఆ మార్కింగ్ పోతున్నట్టు ప్రతిపక్ష నేతలు, ప్రజలు ఆరోపించారు. అసిటోన్ వంటి కెమికల్స్ వాడితే వేలికి పెట్టిన ఇంక్ పోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తంచేశారు.
ఇది దొంగ ఓట్లకు ఆస్కారమిస్తుందని పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే సహా కాంగ్రెస్ నేతలు ఎలక్షన్ కమిషన్ తీరుపై మండిపడ్డారు. కాగా, మార్కర్ పెన్స్‌పై వివాదం చెలరేగడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ (ఎస్‌ఈసీ) వివరణ ఇచ్చింది. ‘‘దీనిపై విచారణ జరిపిస్తాం. ఇంక్ క్వాలిటీతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలపైనా దర్యాప్తు చేస్తాం” అని కమిషనర్ దినేశ్ తెలిపారు.
