- పట్టించుకోకుండాచేపలు పట్టుకెళ్లిన జనం
- బిహార్‌లోని అమానవీయ ఘటన
పాట్నా: బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చేపల లోడ్ తో వెళుతున్న ట్రక్కు ఢీకొని 13 ఏండ్ల బాలుడు చనిపోతే.. స్థానికులు అయ్యో పాపమని సాయం చేయలేదు. డెడ్ బాడీ పక్కనే కిందపడ్డ చేపల కోసం ఎగబడ్డారు. ఓవైపు బాలుడి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నా పట్టించుకోకుండా చేపలను సంచులు, కవర్లలో నింపుకుని మరీ తీసుకెళ్లారు. పుప్రి ఏరియాలోని ఝాజిహాట్ గ్రామానికి చెందిన సంతోష్ దాస్ దంపతులకు రితేశ్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న బాలుడు.. ఎప్పటిలాగే, శుక్రవారం ఉదయం తన సైకిల్‌పై ట్యూషన్ కు బయలుదేరాడు. అయితే, అదే టైంలో చేపల లోడ్ తో వెళ్తున్న ట్రక్కు బాలుడిని ఢీకొట్టి రోడ్డుపైనే పడిపోయింది.
తీవ్ర గాయాలతో రితేశ్‌కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. ట్రక్కు బోల్తా పడడంతో చేపలు కూడా రోడ్డుమీద పడ్డాయి. విషయం తెలుసుకున్న రితేశ్ కుటుంబసభ్యులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, చుట్టూ ఉన్న స్థానికులు మాత్రం అంబులెన్స్ కోసం కాల్ చేయడమో లేక బాధితులకు ఇతర సాయం చేయడమో చేయకుండా చేపల కోసం ఎగబడ్డారు. ఓ పక్క బాలుడి కుటుంబ సభ్యులు మృతదేహం పక్కన గుండెలవిసేలా రోదిస్తుంటే.. మరోపక్క స్థానికులు ట్రక్కు నుంచి పడిన చేపలను సంచుల్లో, కవర్లలో నింపుకోవడం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ప్రజలను చెదరగొట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ప్రమాదానికి కారణమైన పికప్ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.
