మూడు వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు

మూడు వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఓవైపు కరోనా, మరోవైపు డెల్టా వేరియంట్ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కరోనా కేసులు లక్ష దాటాయి. ఒక్క రోజే లక్షా 41 వేల 986 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 21.3 శాతం కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో 40 వేల 925, పశ్చిమబెంగాల్ లో 18వేల 213, ఢిల్లీలో 17వేల 335, తమిళనాడులో 8 వేల 921, కర్నాటకలో 8 వేల 449 మందికి కరోనా సోకింది. 40 వేల 895 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 285మంది చనిపోయారు. డైలీ పాజిటివీ రేటు 9.28శాతంగా నమోదు అయింది. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 72 వేల 169 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 150 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ.

మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ కేసులు 3 వేలు దాటాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు 3 వేల 71కి చేరుకున్నాయి. మహారాష్ట్రలో 879, ఢిల్లీ 513, కర్నాటక 333, రాజస్థాన్ 291, కేరళలో 284 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. గుజరాత్ 204, తెలంగాణలో 123కు చేరుకున్నాయి కొత్త వేరియంట్ కేసులు. ఇందులో 12వందల 3 మంది కోలుకున్నట్లు తెలిపింది కేంద్ర వైద్యారోగ్యశాఖ. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందింది.