విదేశాల్లో బియ్యం కటకట

విదేశాల్లో బియ్యం కటకట
  • విదేశాల్లో బియ్యం కటకట
  • రైస్ ఎగుమతులపై ఇండియా రిస్ట్రిక్షన్లు  పెట్టడమే కారణం

వెలుగు బిజినెస్​ డెస్క్​: ఇప్పుడు ప్రపంచమంతా బియ్యం కోసం ఇండియా వైపు చూస్తోంది. కానీ, దేశంలోని ప్రజల ఆహార భద్రత దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం బియ్యం ఎగుమతులను నియంత్రిస్తోంది. నవంబర్​ నెలలో అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆహార వస్తువుల రేట్లు పెరగకుండా చూడాలనేది కేంద్ర ప్రభుత్వం టార్గెట్​. అంతేకాదు, ఈ సీజన్​లో ఒకవేళ ప్రొడక్షన్​ తగ్గినా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. బియ్యం ఎగుమతులపై ఇండియా ఆంక్షలతో గ్లోబల్​ఫుడ్​ క్రైసిస్ తలెత్తే ప్రమాదం పొంచి ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు.

అమెరికాలో బియ్యం కోసం క్యూలు..

అమెరికాలోని ఎన్​ఆర్​ఐలు బియ్యం కొనుగోలుకు స్టోర్ల ముందు క్యూలు కట్టడం కొన్ని  నెలల కిందట సోషల్​ మీడియాలో వైరల్​ అవడాన్ని చూశాం. బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నియంత్రణలు పెట్టనుందనే రూమర్లు రావడంతోనే అక్కడ కొనుగోళ్లకు లైన్లు కట్టారు. ఈ ఏడాది జులై నెలలో నాన్​–బాస్మతి రైస్​ ఎగుమతులపై మన ప్రభుత్వం నిషేధం విధించింది. దేశం నుంచి జరిగే బియ్యం ఎగుమతులలో నాన్​–బాస్మతి రైస్​ వాటా 25 శాతం. గ్లోబల్​ రైస్​ ఎక్స్​పోర్ట్స్​లో ఇండియా వాటా 40 శాతం. కానీ, దేశంలోని డిమాండ్​ దృష్ట్యా గత కొన్ని నెలలుగా గ్లోబల్ ​డిమాండ్స్​ను ఇండియా పట్టించుకోవడం లేదు. 

రైస్​ ఎక్స్​పోర్ట్​పై ప్రైస్​ రివ్యూ..

బాస్మతి రైస్​ మినిమమ్​ ఎక్స్​పోర్ట్ ప్రైస్​ను రివ్యూ చేయనున్నట్లు ప్రభుత్వం కిందటి వారంలో ప్రకటించింది. బాస్మతి రైస్​ ఎక్స్​పోర్ట్​ ప్రైస్​ను గతంలో టన్నుకు 1200 డాలర్లుగా నిర్ణయించారు. అధిక రేటు ఎగుమతులపై ఎఫెక్ట్​ చూపిస్తున్న నేపథ్యంలో ఆ రేటును రివ్యూ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైస్​ ఎక్స్​పోర్ట్​ అసోసియేషన్లు ఈ రేటును టన్నుకు 850 డాలర్లుగా నిర్ణయించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. బాస్మతి రైస్​ ఎగుమతులను నియంత్రించే ఉద్దేశంతో ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వం మినిమమ్​ ఎక్స్​పోర్ట్​ ప్రైస్​ను 1200 డాలర్లుగా ప్రకటించింది. 

ప్రీమియం బాస్మతి రైస్​ పేరుతో అనధికారికంగా నాన్​–బాస్మతి రైస్​ ఎగుమతులు జరగకుండా చూడాలనే లక్ష్యంతోనే ఈ చర్య తీసుకున్నారు. పారాబాయిల్డ్​ రైస్​ఎగుమతి పైనా 20 శాతం అదనపు డ్యూటీని ఆగస్టు నుంచి విధిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది మార్చి చివరి దాకా అమలవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. రైతులు, ఎగుమతిదారుల డిమాండ్​ నేపథ్యంలో బాస్మతి రైస్​ మినిమమ్​ ఎక్స్​పోర్ట్​ ప్రైస్​ను టన్నుకు 950 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులను కోట్ చేస్తూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హర్యానా, పంజాబ్​, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాలలోని 300 మండీలలో (హోల్​సేల్​ మార్కెట్లు) బాస్మతి రైస్​ కొనడాన్ని ఎగుమతిదారులు, మిల్లర్లు నిలిపి వేశారు. ప్రభుత్వం నిర్ణయించిన 1200 డాలర్ల రేటుతో గ్లోబల్​ మార్కెట్లకు ఎగుమతి చేయలేకే వారు తమ కొనుగోళ్లను ఆపేశారని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

నేపాల్​ బోర్డర్​లో స్మగ్లింగ్​..

బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో నేపాల్​ బోర్డర్​లో స్మగ్లింగ్​ భారీగా పెరిగింది. నేపాల్​కు ఉద్దేశించిన 111.2 టన్నుల రైస్​ను ప్రభుత్వ అధికారులు  పట్టుకున్నారు.

నిషేధం ఎందుకు?

దేశంలో బియ్యం రిటైల్​ రేట్లు అదుపు చేయడంతో పాటు, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉండేలా చూసేందుకే ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలోని 267 జిల్లాలలో జూన్​– ఆగస్టు మధ్య కాలంలో వర్షపాతం తక్కువగా నమోదైనట్లు మెటరాలజీ డిపార్ట్​మెంట్​ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో కొంత ముందు చూపుతో వ్యవహరిస్తే మేలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సీజన్​లో  మన రైస్​ ప్రొడక్షన్ ​4 మిలియన్​ టన్నులు తగ్గి 132 మిలియన్​ టన్నులుగా రికార్డవుతుందని యూఎస్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ అగ్రికల్చర్​ అంచనా వేస్తోంది.