జులై 29న ప్రపంచం అంతా అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, పులుల సంరక్షణలో భారత్ సాధించిన విజయం ప్రపంచానికి ఆశాకిరణంగా నిలుస్తోంది. జీవవైవిధ్యం వేగంగా తగ్గిపోతున్న ఈ కాలంలో, సరైన ప్రణాళిక, ప్రభుత్వ సంకల్పం, శాస్త్రీయ విధానం, ప్రజల భాగస్వామ్యం ఉంటే అంతరించిపోతున్న జంతువులను కూడా తిరిగి పెంచవచ్చని భారత్ నిరూపించింది. పులుల సంఖ్య పెరగడం కేవలం వన్యప్రాణి సంరక్షణలో విజయమే కాదు.
ప్రకృతిని కాపాడటం అంటే భవిష్యత్ తరాలను కాపాడటమేనని ప్రపంచానికి చెప్పిన బలమైన సందేశం. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ప్రపంచ పులుల సదస్సు నాటికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 3,200 అడవి పులులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పట్లో పులులు ఉన్న 13 దేశాలు కలిసి 2022 నాటికి వాటి సంఖ్యను రెట్టింపు చేయాలని 'టీఎక్స్-2' లక్ష్యాన్ని ప్రకటించాయి.
ఇప్పుడు ప్రపంచంలోని అడవి పులుల సంఖ్య సుమారు 5,700కు చేరుకుంది. ఇందులో భారత్ పాత్ర అత్యంత కీలకం. 2022లో విడుదలైన దేశవ్యాప్త పులుల లెక్కల ప్రకారం భారత్‌లో 3,682 పులులు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని ప్రతి 10 అడవి పులుల్లో దాదాపు 7 పులులు భారత అడవుల్లోనే సంచరిస్తున్నాయి. ప్రపంచ భూభాగంలో కేవలం 2.5 శాతం మాత్రమే ఉన్న దేశం ఈ ఘనత సాధించడం ప్రకృతి సంరక్షణ చరిత్రలో అరుదైన విజయంగా నిలిచింది.
ప్రాజెక్ట్ టైగర్
2006లో దేశంలో 1,411 పులులు మాత్రమే ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య 3,682కు చేరుకుంది. ఈ లెక్కల కోసం అటవీ సిబ్బంది దేశవ్యాప్తంగా 6.41 లక్షల కిలోమీటర్లకు పైగా అడవుల్లో కాలినడకన తిరిగి ఆధారాలు సేకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద జీవవైవిధ్య సర్వేలలో ఒకటైన ఈ ప్రక్రియ భారత్ సంరక్షణ వ్యవస్థకు నిదర్శనం. ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతున్న శాస్త్రీయ సంరక్షణ చర్యల ఫలితమే ఈ విజయం. పులులను కాపాడటం అంటే మొత్తం ప్రకృతి వ్యవస్థను కాపాడినట్టే. అడవులు నదులకు జీవం పోస్తాయి. భూసారాన్ని కాపాడతాయి. వర్షాలను సమతుల్యం చేస్తాయి.
ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను తగ్గిస్తాయి. లక్షలాది మందికి తాగునీరు, సాగునీరు, జీవనోపాధికి ఆధారం అవుతాయి. అందువల్ల పులుల సంరక్షణ అనేది పర్యావరణానికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకూ, ప్రజల భవిష్యత్తుకూ సంబంధించిన అంశం. ఈ విజయానికి బలమైన పునాది 1973లో ప్రారంభమైన 'ప్రాజెక్ట్ టైగర్'. తొమ్మిది రిజర్వులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు 18 రాష్ట్రాల్లో విస్తరించిన 58 పులుల అభయారణ్యాలకు చేరుకుంది.
ఇవి మొత్తం సుమారు 84,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 2.56 శాతం. అడవుల పునరుద్ధరణ, అక్రమ వేట నియంత్రణ, అటవీ సిబ్బందికి ఆధునిక సదుపాయాలు, నిరంతర పర్యవేక్షణ, శాస్త్రీయ నిర్వహణ వంటి చర్యలను ప్రభుత్వం దశాబ్దాలుగా కొనసాగిస్తూ వచ్చింది. ఇదే విజయానికి ప్రధాన కారణం.
వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో కీలక పాత్ర
ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసేందుకు 2006లో జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్‌టీసీఏ) ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా పులుల సంరక్షణ ప్రణాళికలను రూపొందించడం, అభయారణ్యాల నిర్వహణను పర్యవేక్షించడం, రాష్ట్రాలకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందించడం వంటి బాధ్యతలను ఈ సంస్థ నిర్వహిస్తోంది.
అలాగే అక్రమ వేట, వన్యప్రాణుల అక్రమ రవాణాను అరికట్టడంలో వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఎం-స్ట్రైప్స్ అనే డిజిటల్ వ్యవస్థ ద్వారా జీపీఎస్ ఆధారంగా అటవీ సిబ్బంది పులుల కదలికలను నమోదు చేస్తున్నారు. అడవుల్లో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్స్ ద్వారా సేకరించిన చిత్రాలను కృత్రిమ మేధతో విశ్లేషించి, ప్రతి పులిని దాని చారల ఆధారంగా గుర్తించే సాంకేతికతను వినియోగిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ఆధారిత వన్యప్రాణుల సర్వే నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును కూడా భారత్ సొంతం చేసుకుంది. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే 'ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్' ప్రపంచంలోనే అతిపెద్ద జీవవైవిధ్య సర్వేగా గుర్తింపు పొందింది. 2022లో తొలిసారిగా పులుల ఆహారంగా ఉండే జింకలు, అడవి దున్నలు వంటి శాకాహార జంతువుల జాతీయ సర్వే కూడా నిర్వహించడం విశేషం.
గ్లోబల్ టైగర్ ఫోరం
ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉన్న గ్లోబల్ టైగర్ ఫోరం ద్వారా 13 పులుల దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోంది. నేపాల్, భూటాన్, రష్యా, మయన్మార్ తదితర దేశాలతో కలిసి సరిహద్దు ప్రాంతాల్లో పులుల సంరక్షణ, అక్రమ వేట నిరోధానికి చర్యలు చేపడుతోంది. 2024లో భారతదేశంలోనే ప్రధాన కార్యాలయంతో ఏర్పడిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా పులులతోపాటు సింహం, చిరుత, మంచు చిరుత, చీతా వంటి ఏడు పెద్ద పిల్లి జాతుల సంరక్షణకు ప్రపంచ దేశాలను ఒక వేదికపైకి తీసుకొస్తోంది. దీంతో ప్రకృతి సంరక్షణ రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.
పులులు ఒక అడవి నుంచి మరో అడవికి సురక్షితంగా సంచరించేందుకు అవసరమైన వన్యప్రాణుల కారిడార్లను కాపాడటం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఈ సహజ మార్గాలు దెబ్బతింటే పులుల దీర్ఘకాలిక మనుగడకే ముప్పు ఏర్పడుతుంది. పులులను కాపాడటం అంటే ఒక జంతువును మాత్రమే రక్షించడం కాదు. అడవులను, నదులను, జీవవైవిధ్యాన్ని, చివరికి మన భవిష్యత్తునే కాపాడటం. అందుకే పులులను కాపాడిన భారత్, ప్రకృతిని కాపాడే మార్గాన్ని ప్రపంచానికి చూపించిన దేశంగా నిలిచింది.
ఆర్ధ శ్రీనివాస్ పటేల్, మీడియా & కమ్యూనికేషన్ అధికారి
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
