
- ఇండియా మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతది
- ఈ జర్నీలో యూకే భాగస్వామ్యం అవుతది
- ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఓ మైలురాయి అని వ్యాఖ్య
- ఇండియా, యూకేది ‘నేచురల్ పార్ట్నర్ షిప్’: ప్రధాని మోదీ
ముంబై: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ ఎస్సీ)లో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ అన్నారు. ఈ విషయంలో ఇండియాకు తమ దేశం పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా యూకే ప్రధాని హోదాలో తొలిసారి కీర్ స్టార్మర్ ఇండియాకు వచ్చారు. గురువారం ముంబైలోని రాజ్‌భవన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్నొవేషన్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్, ఎడ్యుకేషన్, క్లైమేట్ చేంజ్ వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అనంతరం జాయింట్ ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా స్టార్మర్ ‘‘నమస్తే దోస్తులూ..’’ అంటూ తన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించారు. ‘‘ఇండియా అద్భుతమైన అభివృద్ధి సాధిస్తున్నది. అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించగల సామర్థ్యం కలిగి ఉన్నది. శాశ్వత సభ్యత్వం ఇచ్చే విషయంలో ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, రష్యా మద్దతు తెలిపాయి.
ఇప్పుడు మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఇండియా ఇటీవలే జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2028 నాటికి మూడో ఆర్థికశక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేస్తున్న. ఇక్కడికొచ్చి ఈ పరిస్థితులు చూస్తుంటే మీరు లక్ష్యాన్ని చేరుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఈ ప్రయాణంలో మేమూ భాగం కావాలనుకుంటున్నం’’ అని కీర్ స్టార్మర్ అన్నారు.
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మైలురాయి..
ఇండియా, యూకే మధ్య ఖరారైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఓ చారిత్రక మైలురాయి అని కీర్ స్టార్మర్ అన్నారు. నాణ్యమైన ఉన్నత విద్యకు ఈ రోజుల్లో డిమాండ్ పెరుగుతోందని, అందుకే ఇండియాలో మరిన్ని బ్రిటీష్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. టెక్నాలజీ, ఇన్నొవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఇండియా, యూకేల మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని చెప్పారు. ‘‘దశాబ్ద కాలంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రతినిధి బృందం (126 మంది)తో నేను ఇండియాకు వచ్చాను. ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యాన్ని రెట్టింపు చేయడమే మా లక్ష్యం.
అందుకే ఈ ఏడాది జులైలో రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది’’అని కీర్ స్టార్మర్ అన్నారు. ఈ పర్యటనలో భాగంగా యూకేలో బాలీవుడ్ చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరిందని స్టార్మర్ ప్రకటించారు. యూకేలో డిజిటల్ ఐడీలు ప్రవేశపెట్టబోతున్నం ఇండియాలో ఆధార్ ఐడీ వ్యవస్థ భారీ విజయం సాధించిందని కీర్ స్టార్మర్ కొనియాడారు. అందుకే తమ పర్యటనలో ఆధార్‌కు సంబంధించి కూడా ఓ కీలక భేటీ జరిగిందని ప్రకటించారు. ‘‘అక్రమ వలసదారులను అరికట్టేందుకు యూకేలో డిజిటల్ ఐడీలను ప్రవేశపెట్టబోతున్నాం.
ఇండియా ఆధార్ వ్యవస్థ బాగుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఈ డిజిటల్ ఐడీ సాయంతో యూకే పౌరులు ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ పథకాలు, ఇతర ప్రజా సేవలను సులభంగా పొందేలా చేస్తాం. అందుకే ఇండియా ఆధార్ పై స్టడీ చేస్తున్నాం’’అని స్టార్మర్ తెలిపారు.
2030 నాటికి వాణిజ్యం రెట్టింపు అవుతది: మోదీ
ఇండియా, యూకే మధ్య ఉన్నది ‘నేచురల్ పార్ట్నర్షిప్’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, రూల్ ఆఫ్ లా ఉమ్మడి విలువలకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. ఇండియా, యూకే సంబంధాల్లో కొత్త శక్తి ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘జులైలో యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఈ డీల్.. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేస్తుంది.
స్కాచ్, విస్కీ, ఆటో మొబైల్స్ వంటి యూకే ఎగుమతులు ఇండియా మార్కెట్ లో యాక్సెస్ పొందుతాయి. వికసిత్ భారత్ దార్శనికతకు ఇది మద్దతు ఇస్తుంది. డిఫెన్స్ కోఆపరేషన్ కూడా మరింతగా బలోపేతమవుతుంది. ఇరుదేశాల భాగస్వా మ్యం.. ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక పురోగతికి కీలకమైన పునాదిగా మారుతోంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌తో దిగుమతి ఖర్చు తగ్గుతది
రాడికలిజం, హింసాత్మక తీవ్రవాదానికి ప్రజాస్వామ్య సమాజంలో స్థానం లేదని మోదీ అన్నారు. సమాజం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడానికి అనుమతించొద్దని స్టార్మర్ను మోదీ కోరారు. చట్టప్రకారం శిక్షించాలని అన్నారు. ఖలిస్తానీ టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘‘ఇండియా, బ్రిటన్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. రెండు దేశాలకు దిగుమతి ఖర్చు తగ్గిస్తుంది. ఈ ఒప్పందం ఇండియాలోని పరిశ్రమలు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
డీల్‌పై సంతకం చేసిన కొద్ది నెలల్లోనే, 126 మందితో కూడిన అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందాన్ని యూకే ప్రధాని స్టార్మర్ ఇండియాకు తీసుకొచ్చారు. ఈ పరిణామం.. ఇరుదేశాల భాగస్వామ్యం మరింత బలపడుతుంది. యూకేకు చెందిన 9 యూనివర్సిటీలు ఇండియాలో క్యాంపస్‌లు ప్రారంభించాయి. సౌతాంప్టన్ యూనివర్సిటీ గురుగ్రామ్ క్యాంపస్ ఇప్పటికే ప్రారంభమైంది’’ అని మోదీ అన్నారు.