అమెరికాను సరిగ్గా అర్థం చేసుకోండి.. భారత మార్కెట్లను తెరవండి: హోవార్డ్ లుట్నిక్

అమెరికాను సరిగ్గా అర్థం చేసుకోండి.. భారత మార్కెట్లను తెరవండి: హోవార్డ్ లుట్నిక్

భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం టారిఫ్స్ కొనసాగిస్తున్న వేళ.. ప్రధాని మోడీ తన వ్యూహాన్ని మార్చారు. అమెరికా మినహా ఇతర ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తుల ఎగుమతి పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో చైనాతో కూడా చేతులు కలపటం అమెరికాకు అస్సలు మింగుడు పడటం లేదు. 

ఈ క్రమంలోనే వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవాలనుకుంటున్న "పెద్ద" దేశాల జాబితాలో భారత్‌ను అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ చేర్చారు. అమెరికా మార్కెట్లలో తమ ఉత్పత్తులను అమ్ముకోవటాన్ని పెంచుకోవటాలంటే భారత్ తన విధానాలను కూడా మార్చుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. స్విడ్జర్లాండ్, బ్రెజిల్, భారత్ వంటి దేశాలు అమెరికా విషయంలో సరిగ్గా స్పందించటం లేదని.. ఈ దేశాలు అమెరికా వ్యాపారులకు తమ మార్కెట్లను తెరవాలని అన్నారు. అలాగే అమెరికాకు హాని కలిగించే చర్యలను వెంటనే ఆపాలని అన్నారు లుట్నిక్. 

రష్యా నుంచి చమురు కొంటున్నారంటూ కారణం చూపుతూ ఇండియాపై సుంకాలను 50 శాతానికి పెంచటం.. ఇదే సమయంలో ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న పాకిస్థాన్ విషయంలో అత్యంత తక్కువ పన్నులు వేయటం అమెరికా ధ్వంద నీతికి అద్ధం పడుతోంది. అయితే అనేక వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని.. రానున్న కాలంలో ఇండియా, బ్రెజిల్ వంటి దేశాలతో సమస్యలు పరిష్కారం అవుతాయని లుట్నిక్ చెప్పారు. 

ఇప్పటికే యూఎస్ ఇండియా మధ్య వాణిజ్య చర్చలు తిరిగి స్టార్ట్ అయ్యాయి. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సెప్టెంబర్ 22 నుంచి 24 మధ్య వాషింగ్టన్‌ను వెళ్లింది. ఈ ప్రతినిధి బృందం అమెరికా వాణిజ్య ప్రతినిధి రాయబారి జామిసన్ గ్రీర్.. భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్‌లను కలిసి ఒప్పందం గురించి చర్చించింది. పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించే లక్ష్యంతో చర్చలు కొనసాగాయి. అలాగే భారత వృద్ధిపై అమెరికా ఇన్వెస్టర్లు కూడా విశ్వాసంతో ఉన్నట్లు వెల్లడైంది.