షెహబాజ్ నీతులు చెప్పడం మానుకో

షెహబాజ్ నీతులు చెప్పడం మానుకో

భారత్ లో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ పై భారత్ ఘాటుగా స్పందించింది. మైనారిటీ హక్కుల గురించి మాట్లాడే అర్హత పాకిస్తాన్ కు లేదని పేర్కొంది. ఈమేరకు  భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ లోని హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, అహ్మదీయులపై జరిగిన దాడులకు యావత్ ప్రపంచం సాక్షిగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్ లో పలువురు క్రైస్తవ యువకులు, మత పెద్దలపై అమానుష దాడులు జరిగాయని పేర్కొన్నారు.

భారత్ కు నీతులు చెప్పడం మానుకొని, మైనారిటీ వర్గాల సంక్షేమంపై దృష్టిసారించాలని పాక్ కు అరిందమ్ బాగ్చి హితవు పలికారు. ‘‘ఓ కుట్ర ప్రకారం భారత్ లోని మైనారిటీలను హింసిస్తున్నారు’’ అంటూ ఇటీవల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కొఆపరేషన్ (ఓఐసీ) చేసిన ప్రకటనను కూడా భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఆ ప్రకటనలో కొంచెం కూడా వాస్తవికత లేదని స్పష్టం చేసింది. మైనారిటీ వర్గాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పార్టీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ లపై ఆదివారం బీజేపీ సస్పెన్షన్ వేటు విధించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు..

అంటే సుందరానికి నుంచి తందనానంద సాంగ్ రిలీజ్

"పుట్టినరోజు శుభాకాంక్షలు, నాన్న"