దేశంలో 38 శాతం పెరిగిన టీవీ షిప్​మెంట్లు

దేశంలో 38 శాతం పెరిగిన టీవీ షిప్​మెంట్లు

న్యూఢిల్లీ: మనదేశంలో స్మార్ట్ టీవీ  షిప్‌మెంట్లు జులై –సెప్టెంబర్ క్వార్టర్లో ఏడాది ప్రాతిపదికన 38 శాతం పెరిగాయి. పండుగ సీజన్ ,  కొత్త లాంచ్‌లు, డిస్కౌంట్ ఈవెంట్లు,  ప్రమోషన్లు ఇందుకు కారణమని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. దీని ప్రకారం..  చైనా మినహా గ్లోబల్ బ్రాండ్లు భారతదేశం  స్మార్ట్ టీవీ మార్కెట్లో 40 శాతం వాటాతో ముందుండగా, చైనీస్ బ్రాండ్లు 38 శాతం వాటాతో రెండో స్థానంలో ఉన్నాయి. భారతీయ బ్రాండ్లు వేగంగా వృద్ధిని సాధిస్తుండగా, మొత్తం స్మార్ట్ టీవీ షిప్‌మెంట్‌లలో వీటి వాటా 22 శాతానికి చేరింది. తాజా క్వార్టర్లో మొత్తం షిప్‌మెంట్‌లలో 32 ఇంచుల,-42 ఇంచుల డిస్‌ప్లేల వాటా ఎక్కువగా ఉంది. ఎల్​ఈడీ డిస్‌ప్లేలను ఎక్కువ మంది కొంటున్నప్పటికీ, ఓఎల్​ఈడీ,  క్యూఎల్​ఈడీ వంటి టీవీలకూ డిమాండ్​ పెరుగుతోంది.

చాలా బ్రాండ్లు మరిన్ని క్యూఎల్​ఈడీ  టీవీ మోడల్స్​ను తీసుకురానున్నాయి. డాల్బీ ఆడియో, క్వాలిటీ సౌండ్ అవుట్​పుట్​వంటి ఫీచర్లకు అన్ని బ్రాండ్లు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్వార్టర్లో మొత్తం షిప్‌మెంట్‌లలో స్మార్ట్ టీవీల వాటా 93 శాతానికి చేరుకుంది. రూ. 20,000 కంటే తక్కువ ధర గల మరిన్ని టీవీలు రాబోతుండటంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.  ఇటీవలి పండుగ సీజన్​లో అన్ని ప్రధాన ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రత్యేకమైన లాంచ్‌లతో పాటు వివిధ ప్రమోషన్‌లు,  డిస్కౌంట్‌లను అందించాయి. దీంతో మొత్తం షిప్‌మెంట్‌లలో ఆన్‌లైన్ చానెల్స్​ అమ్మకాల వాటా 35 శాతానికి పెరిగింది. షావోమీ  11 శాతం మార్కెట్ వాటాతో  నంబర్​వన్​గా నిలిచింది. శామ్‌సంగ్ 10 శాతం వాటాతో,  ఎల్​జీ 9 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.